
తమిళనాడులో అధికార డీఎంకే, గవర్నర్ ఆర్‌ఎన్ రవిలకు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్‌లకు గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని కోరడానికి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలని స్టాలిన్ లేఖలో కోరారు. చట్టసభల్లో ఆమోదించి పంపే బిల్లులను కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని.. దీంతో ఆ రాష్ట్రాల పరిపాలనా వ్యవహారాలు స్తంభిస్తున్నాయని పేర్కొన్నారు.
“రాష్ట్ర శాసనసభలు సక్రమంగా ఆమోదించి.. ఆమోదం కోసం పంపబడిన బిల్లులను కొందరు గవర్నర్లు నిరవధికంగా పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇది ఆయా విభాగాలలో సంబంధిత రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేస్తుంది’’ అని స్టాలిన్ అన్నారు. ‘‘ఈ సమస్యకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే.. ‘బిల్ టు బ్యాన్ ఆన్‌లైన్ రమ్మీ’తో సహా ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్ లేవనెత్తిన సందేహాలు, ఆందోళనలను నివృత్తి చేయడానికి మేము అనేక ప్రయత్నాలు చేశాం. మా ప్రయత్నాలు విఫలమైనందున మరియు అనేక ఇతర రాష్ట్రాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని మేము తెలుసుకున్నాము.
సంబంధిత శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌లు ఆమోదించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాష్ట్రపతిని కోరుతూ మా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం సరైనదని తమిళనాడులో మేము భావించాము. మీరు ఈ తీర్మానం స్ఫూర్తి, కంటెంట్‌తో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మీ రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభల సార్వభౌమాధికారం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మీ మద్దతు అందించండి’’ అని స్టాలిన్ ఈ లేఖలో కోరారు.
భారత రాజ్యాంగం గవర్నర్ పాత్రతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించిందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ నేడు కాలపరీక్షను ఎదుర్కొంటున్నాయన్నారు.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి విపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి వారి రాష్ట్రాల గవర్నర్‌లు చట్టసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.