ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

By narsimha lodeFirst Published Sep 1, 2019, 2:36 PM IST
Highlights

తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ తమిళసై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగు సార్లు పోటీపడినప్పటికీ.. ఆమెను దురదృష్టం వెంటాడింది. 

తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె...డాక్టర్‌గా సేవలందించారు.

కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌ కోలీ గ్రామంలో 1961 జూన్ 2న కుమారి అనంతన్, కృష్ణ కుమారి దంపతులకు తమిళసై జన్మించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి.. వైద్యురాలిగా సేవలిందించారు. అనంతరం సౌందర రాజన్ అనే వైద్యుడిని ఆమె వివాహం చేసుకున్నారు.

మామగారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఆ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అత్తింటి వారు కాంగ్రెస్ పార్టీతో తరతరాలుగా అనుబంధం కొనసాగిస్తున్నప్పటికీ.. తమిళసై మాత్రం బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో విద్యార్ధి నాయకురాలిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు.

బీజేపీలో కార్యకర్తగా చేరి అనేక పదవులు నిర్వహించారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా విద్యా విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉన్నారు.

రాజకీయాల్లో సుధీర్ఘ ప్రస్థానం ఉన్నప్పటికీ తమిళసై ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు.

అనంతరం 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ.. తమిళిసైకి నిరాశే ఎదురైంది. చివరికి ఆమెను గవర్నర్ పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

click me!