అరక్కోణంలో ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. క్రేన్ కూలి నలుగురు మృతి, 9 మందికి గాయాలు..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2023, 10:42 AM IST
Highlights

తమిళనాడులోని అరక్కోణం సమీపంలో ద్రౌపతి దేవి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఊరేగింపులో క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. 

తమిళనాడులోని అరక్కోణం సమీపంలో ద్రౌపతి దేవి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఊరేగింపులో క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మృతులను  మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో జరిగింది. వివరాలు.. ఆదివారం రాణిపేటలోని అరక్కోణం సమీపంలోని కిల్వీడి గ్రామంలో ద్రౌపతి దేవి ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు చేపట్టారు. గ్రామంలోని వీధుల్లో దేవతా విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు క్రేన్‌ను వినియోగించారు. 

దేవతా విగ్రహాన్ని అలంకరించేందుకు భక్తుల నుంచి మాలలు స్వీకరించడానికి కొందరు వ్యక్తులు కొంత ఎత్తులో క్రేన్‌పై ఉన్నారు. ఊరేగింపు సమయంలో ఆలయం సమీపంలో క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఆసుపత్రికి తరలించినవారిలో ఒకరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. 9 మంది ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. 

మృతుల్లో ముగ్గురిని ముత్తుకుమార్, ఎస్. భూపాలన్, జోతిబాబులుగా గుర్తించారు. వీరు ముగ్గురు కూడా అదే గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితులు  నెలకొన్నాయి. ఇక, ఈ ఉత్సవాలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు హాజరైనట్టుగా చెబుతున్నాయి. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

click me!