బుల్డోజర్లతో ఇల్లు కూల్చడం ఓ తమాషా అయిపోయింది.. అధికారులతో డబ్బులు కట్టిస్తా..: పోలీసులపై హైకోర్టు జడ్జీ ఫైర్

By Mahesh KFirst Published Dec 4, 2022, 4:03 PM IST
Highlights

బిహార్‌లో బుల్డోజర్లతో ఇల్లు కూల్చడం ఒక తమాషా అయిపోయిందని పాట్నా హైకోర్టు పోలీసులపై సీరియస్ అయింది. ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా పోలీసులు ఓ మహిళ నివాసాన్ని కూల్చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఒక వేళ పోలీసుల తప్పు ఉన్నట్టు తేలితే వారి జేబుల్లో నుంచి ఐదు.. ఐదు లక్షలు బాధితులకు ఇప్పిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
 

పాట్నా: బుల్డోజర్లతో ఇల్లు కూల్చడం ఓ తమాషా అయిపోయిందని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై పోలీసులు ఓ మహిళ ఇంటిని బుల్డోజర్‌లో నేలమట్టం చేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో జడ్జీ విచారణ చేస్తున్నారు. ఈ కేసులో విచారణలు వింటూ బిహార్‌ పోలీసులపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఒక వేళ పోలీసులదే తప్పు అని తేలితే ఒక్కో అధికారి నుంచి ఐదు - ఐదు లక్షల చొప్పున బాధితులకు ఇప్పిస్తానని అన్నారు.

‘ఏంటిది.. ఇక్కడ కూడా బుల్డోజర్లు నడుస్తున్నాయా? మీరు ఎవరి తరఫున రాష్ట్ర ప్రభుత్వమా లేక ప్రైవేటు వ్యక్తులకు ప్రతినిధులా? ఎవరి ఇల్లునైనా బుల్డోజర్‌తో కూల్చేస్తారని తమాషా చేస్తున్నారా?’ అని జస్టిస్ సందీప్ కుమార్ అన్నారు. పోలీసుల ఎఫ్ఐఆర్‌లోని ఆరోపణలను న్యాయమూర్తి ప్రస్తావిస్తూ ‘పోలీసులదే తప్పు అని తేలితే అధికారుల జేబులో నుంచే ఐదు.. ఐదు లక్షల రూపాయాలు ఇప్పిస్తాం. లంచం తీసుకుని పోలీసులు, ఇతరులు కలిసి ఇల్లు కూలుస్తారు. దీన్ని వెంటనే ఆపివేయాల్సి ఉన్నది’ అని జస్టిస్ కుమార్ వివరించారు. తదుపరి విచారణకు సీనియర్ పోలీసు అధికారులు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు.

Also Read: Supreme Court: కూల్చివేత చట్టం ప్రకారం జరగాలి.. యూపీ బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు

నవంబర్ 24వ తేదీన ఈ విచారణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. చట్టానికి లోబడకుండా రాష్ట్ర పోలీసులు అక్రమంగా ఇంటిని కూల్చేశారని కేసు వివరాలు చదువుతూ జడ్జీ పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియా చెప్పుచేతల్లో పోలీసులు నడుచుకుంటున్నట్టు అర్థం అవుతున్నదని వివరించారు. అదే సమయంలో పిటిషనర్ తరఫు లాయర్ మాట్లాడుతూ బాధిత కుటుంబం ఆ భూమి వదిలి వెళ్లిపోయేలా ఒత్తిడి చేస్తూ పోలీసులు తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. దీనికి తాము వారిని రక్షించడానికే ఇక్కడ ఉన్నామని వివరించారు.

ఒక కేసులో దోషులుగా తేలడానికి ముందే అనుమానితుల ప్రాపర్టీని పోలీసులు కూల్చేసే ధోరణి ఉత్తరప్రదేశ్‌లో మొదలైంది. కేసుకు సంబంధం లేని ఉల్లంఘనలు పేర్కొంటూ ప్రాపర్టీని కూల్చేయడం వంటి ఘటనలు ఇటీవలే మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే.

click me!