తాలిబాన్ల చెరలో 150 మంది.. బందీల్లో ఎక్కువ మంది భారతీయులే

By telugu teamFirst Published Aug 21, 2021, 12:48 PM IST
Highlights

కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తాలిబాన్లు భారతీయులను బంధించినట్టు సమాచారం అందింది. మొత్తం 150 మందిని బంధించగా ఇందులో మెజార్టీగా భారతీయులే ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం భారతీయులను తరలించడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం సిద్ధంగా ఉన్నది.

న్యూఢిల్లీ: తాలిబాన్ల నుంచి భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. కాబూల్ ఎయిర్‌పోర్టు సమీపంలో వారు భారతీయులను బంధించారు. మొత్తం 150 మందిని తమ అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఇందులో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. భారత విదేశాంగ శాఖ దీనిపై ఆరా తీస్తున్నది. ఇంకా ధ్రువీకరించలేదు.

కాబూల్ ఎయిర్‌పోర్టులో వారం రోజులుగా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. ఇతర దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడానికి విమానాలను పంపిస్తున్నాయి. వందల సంఖ్యలో విదేశీయులు ఆఫ్ఘనిస్తాన్ దాటారు. ఇటీవలే 85 భారతీయులను భారత వైమానిక దళ విమానం సీ-130జే సురక్షితంగా అఫ్ఘాన్ సరిహద్దు దాటించింది. పొరుగునే ఉన్న తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో సేఫ్‌గా దింపినట్టు తెలిసింది. ఇంకా పెద్దసంఖ్యలో భారతీయులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు. కనీసం వెయ్యి మంది వరకు భారతీయులు ఇంకా అఫ్ఘాన్‌లో చిక్కుకున్నట్టు సమాచారం. వీరిని తరలించడానికే తాజాగా రెండో విమానం సీ-17 కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నది. కానీ, ఇంతలోనే తాలిబాన్లు ఎయిర్‌పోర్టు సమీపంలోనే 150 మందిని బంధించినట్టు తెలిసింది. ఇందులో పెద్దసంఖ్యలో భారతీయులు ఉండటంతో కలకలం రేగుతున్నది.

భారతీయులను సురక్షితంగా చూసుకుంటామని తాలిబాన్లు ఇది వరకే ప్రకటించారు. భారత దౌత్యాధికారులకూ ఎలాంటి హాని తలపెట్టబోమని వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ, తర్వాతి రోజే కాందహార్, హెరాత్‌లోని భారత కాన్సులేట్‌లలో సోదాలు చేసి అక్కడ పార్క్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్‌ను ఎత్తుకెళ్లిన ఘటన ఆందోళన కలిగించింది. తాలిబాన్ నాయకత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చేతలకు పొంతన లేదని స్పష్టమైంది. తాజాగా, ఈ ఉదంతం ఆ వాదనను ధ్రువీకరించినట్టయింది.

click me!