
Amit Shah slams Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వాయనాడ్ ఎంపీ తప్పనిసరిగా ఇటాలియన్ కళ్లద్దాలు తీసి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని హితవుపలికారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని నంసాయి జిల్లాలో రూ.1000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు అమిత్ షా ఆదివారం నాడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
అలాగే, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు దేశంలో మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. అయినప్పటికీ ఎనిమిదేళ్లలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, ఇంతమంది కళ్లు మూసుకుని మెలకువగా ఉన్నారంటూ విమర్శిస్తూ.. రాహుల్ బాబా తప్పనిసరిగా ఇటాలియన్ కళ్లద్దాలు తీసి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి పెమాఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని అమిత్ షా అన్నారు. అరుణాచల్‌లో గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి మరియు పర్యాటక రంగాన్ని పెంచడానికి చాలా పనులు జరిగాయని తెలిపారు. సీఎం పెమా ఖండూ, ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లలో చేసిన పని 50 ఏళ్లలో జరగలేదని అమిత్ షా అన్నారు.
కేంద్ర హోంమంత్రి అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈరోజు తెల్లవారుజామున అరుణాచల్ ప్రదేశ్‌లోని నంసాయ్ జిల్లాలోని గోల్డెన్ పగోడాను షా సందర్శించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఆయన వెంట ఉన్నారు. షా భద్రత మరియు అభివృద్ధిని సమీక్షిస్తారు. అలాగే, సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB), అస్సాం రైఫిల్స్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDLC) అధికారులతో నంసాయి వద్ద సమావేశం కానున్నారు. ఆర్మీ సిబ్బంది, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) దళాల అన్ని ర్యాంకుల వారితో కలిసి భోజన విందులో కూడా అమిత్ షా పాలుపంచుకోనున్నారు.
అంతకుముందు, పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని సామాన్య ప్రజలకు నిజమైన ఉపశమనం కావాలంటే మరిన్ని కోతలు కావాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆదివారం వ్యాఖ్యలు చేశారు. రికార్డు ద్రవ్యోల్బణం నుంచి నిజమైన ఉపశమనం పొందేందుకు ప్రజలు అర్హులని అన్నారు. కాబట్టి పౌరులను మోసం చేయడం మానుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేశారు. దీని ప్రకారం పెట్రోల్ ధర 2020 మే 21వ తేదీన రూ.69గా ఉండగా.. 2022 మే 21వ తేదీన పెట్రోల్ ధర లీటర్ కు రూ.105.4 కు పెరిగింది.