
న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి ఇంటా బయటా విశేష ఆదరణ ఉన్నది. కేవలం మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ భారత ప్రవాసులు ప్రధానిపై గౌరవాభిమానాలు కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలో ప్రవాస భారతీయులను ప్రధాని మోడీ కలుస్తుంటారు. వారికి ప్రత్యేకంగా సమయం కేటాయించి గడపడానికి ముఖ్యంగా చిన్నపిల్లలతో ఆయన ఎక్కువగా సమయం గడపటానికి ఇష్టపడతారు. పిల్లల నుంచి కూడా ప్రధాని మోడీకి అపూర్వమైన బహుమతులు అందుతుంటాయి. ఇటీవలే యూరప్ పర్యటనలో ప్రధాని మోడీకి పిల్లల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన రెండు రోజుల పర్యటనలో జపాన్‌లో ఉన్నారు. జపాన్‌లోనూ ఓ బుడతడు ప్రధాని మోడీని హిందీలో పలకరించాడు. ఆయనకు స్వాగతం పలికాడు. ఆ బుడతడు హిందీలో స్పందించడంతో ప్రధాని మోడీ పులకరించిపోయాడు. ఆ బాలుడిని వాహ్ అంటూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
జపాన్ వెళ్లిన ప్రధాని మోడీ టోక్యో నగరంలో ఆయనకు వెల్‌కమ్ చెప్పడానికి ఎదురుచూస్తున్న పిల్లల దగ్గరకు వెళ్లాడు. అందులో రిత్సుకి కొబయాషి అనే బాలుడు.. జపాన్‌కు స్వాగతం అంటూ ప్రధాని మోడీకి హిందీలో చెప్పాడు. నేను మీ సంతకాన్ని తీసుకోవచ్చునా? అంటూ అడిగాడు. హిందీలో సరళంగా ఆ జపనీస్ బాలుడు మాట్లాడటాన్ని చూసి ప్రధాని మోడీ అబ్బురపడ్డాడు.
వాహ్.. అని ఆ బాలుడిని ప్రధాని మెచ్చుకున్నారు. ‘హిందీ భాష ఎక్కడి నుంచి నేర్చుకున్నావ్.. నువు చాలా బాగా హిందీ మాట్లాడుతున్నావు తెలుసా’ అంటూ ప్రశంసించారు. అనంతరం ఆ బాలుడు వేసిన చిత్రపటాన్ని చూశాడు. ఆ బాలుడితో ఆ చిత్రం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత మరో బాలిక తాను వేసిన ప్రధాని మోడీ చిత్రపటాన్ని చూపించింది. ఆమెతో ప్రధాని ఇంటరాక్ట్ అయ్యాడు.
తాను హిందీ భాష ఎక్కువగా మాట్లాడలేనని, కానీ, అర్థం చేసుకోగలనని ఆ బాలుడు రిత్సుకి కొబయాషి విలేకరులకు చెప్పాడు. అయితే, ప్రధాని మోడీ తన సందేశాన్ని చదివారని, ఆయన సంతకాన్ని కూడా తాను తీసుకోగలిగానని వివరించాడు. తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు.
అక్కడే ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ భారతదేశ ప్రాంతీయ భాషాల్లో రాసిన ప్లకార్డులను చూపిస్తూ సాంప్రదాయ దుస్తులు ధరించి పిల్లలు నిలబడ్డారు.