‘తాజ్ మహల్ కూల్చొద్దు.. పేరు మార్చాలి’

First Published Jun 11, 2018, 4:26 PM IST
Highlights

మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తాజ్ మహల్ పై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు రామాయణం, భారతం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా యూపీ భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌  తాజ్‌మహల్‌పై చేసిన వ్యాఖ్యలు  దుమారం రేపుతున్నాయి.

 ‘మొఘలుల పాలనా కాలం ముగిసిపోయిన తర్వాత వారి పేర్ల మీద ఉన్న రోడ్ల పేర్లు, చారిత్రక కట్టడాల పేర్లను మార్చాలి. ఇందులో భాగంగా తాజ్‌ మహల్‌ పేరును రామ్‌ మహల్‌, కృష్ణ మహల్‌ లేదా శివాజీ మహల్‌గా నామకరణం చేయాలి’ అంటూ సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అనంతరం మొఘలులు నిర్మించిన కట్టడాలపై ఆయన మాట్లాడుతూ... ‘మొఘలులు నిర్మించిన కట్టడాలను కూల్చడానికి వీల్లేదు. ఎందుకంటే అవి భారత నేలపై నిర్మించినవి. దీనికి బదులుగా వాటి పేర్లు మార్చాలి. నాకు వీటి పేర్లు మార్చే అవకాశం ఇస్తే తాజ్‌ మహల్‌కు ‘రాష్ట్ర భక్తి మహల్‌’ అని నామకరణం చేస్తాను. మొఘలులు కట్టిన ఏదైనా ఒక కట్టడానికి డా. ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు పెట్టి చూడండి. ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వోద్యోగులు ఒకవేళ లంచం అడిగితే వారిని బూటుతో మొహం మీద కొట్టండంటూ సురేంద్ర సింగ్‌ ఈ మధ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భాజపా నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని, పొరపాటున నోరుజారి మీడియాకు మసాలా ఇవ్వద్దని ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలం కిందట తమ నేతలకు సూచించారు. అయితే ఆ మరుసటి రోజే సురేంద్ర సింగ్‌... పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శూర్పణఖగానూ, మోదీని రామావతారంగానూ అభివర్ణించి వార్తల్లోకెక్కారు.

click me!