
జైపూర్: ఇప్పుడు కొత్తగా తాజ్‌మహల్ చుట్టూ వివాదం రాజుకుంటున్నది. తాజ్‌మహల్‌లో శాశ్వతంగా మూసి ఉంచిన 22 గదులను తెరిచి అందులో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయో లేదో? చూడాలని అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అంతకు ముందే తాజ్‌మహాల్ శివాలయం అని, దాన్ని తేజోమహాలయంగా ప్రకటించాలనే వాదనలు జరిగాయి. అయితే, వీటికి పొడిగింపుగా తాజాగా మరో వ్యాఖ్య ముందుకు వచ్చింది. జైపూర్ రాజవంశానికి చెందిన దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ అడుగు భూమి తమదేనని అన్నారు.
అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు మద్దతుగా ఈ బీజేపీ ఎంపీ దియా కుమారి మాట్లాడారు. తాజ్‌మహల్ నిర్మించకముందు అక్కడ ఏమి ఉండేదో దర్యాప్తు చేయాల్సిందేనని వాదించారు. ఈ సమాధి కంటే ముందు అక్కడ ఏమి ఉండేదో తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉన్నదని వివరించారు. తాజ్‌మహల్ తమ భూమిలోనే నిర్మించారని, ఆ భూమి తమదేనని నిరూపించే డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయని తెలిపారు.
ముఘల్ పాలకుడు షా జహాన్ తమ నుంచి ఆ భూమిని దురాక్రమించాడని ఆమె వివరించారు. అయితే, ఆ భూమికి బదులు పరిహారం ఇచ్చాడని చెప్పారు. అయితే, ఎంత మొత్తంలో ఆ పరిహారం ఇచ్చారనేది తనకు తెలియదని పేర్కొన్నారు. అసలు ఆ పరిహారాన్ని తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని కూడా ఆ రికార్డులను పరిశీలించకుండా తాను వ్యాఖ్యానించడం సరికాదని వివరించారు. కానీ, ఆ భూమి మాత్రం తమ కుటుంబానిదేనని, దాన్ని షా జహాన్ ఆక్రమించుకున్నాడని తెలిపారు. అప్పుడు జ్యూడిషియరీ లేదని, కాబట్టి,
అప్పీల్ కూడా చేయలేదని వివరించారు. అయితే, ఆ రికార్డులను పరిశీలించిన తర్వాత అసలు విషయం ఏమిటో తెలియవస్తుందని పేర్కొన్నారు.
మరి ఆ మాజీ రాజకుటుంబానికి సంబంధించిన ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేస్తారా? అని ప్రశ్నించగా, తాము ఈ విషయంపై ఆలోచనలు చేస్తున్నామని బీజేపీ ఎంపీ దియా కుమారి వివరించారు. ఏం నిర్ణయాలు, ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో బీజేపీ ఎంపీ దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం రాముడి కొడుకు వారసత్వమేనని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తాము ఈ వారసత్వాన్ని నిరూపించే ఆధారాలు వెల్లడిస్తామని, తద్వార అయోధ్యలో రామ మందిర నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.