కుక్కకు భయపడి ప్రాణ రక్షణ కోసం మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్ మృతి.. హైదరాబాద్‌లో ఘటన

By Mahesh KFirst Published Jan 16, 2023, 2:49 PM IST
Highlights

కుక్క నుంచి కాపాడుకోవడానికి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ శనివారం నిమ్స్‌లో ప్రాణాలు కోల్పోయాడు. బంజారా హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి డెలివరీ ఏజెంట్ మొహమ్మద్ రిజ్వాన కిందికి దూకేశాడు.
 

హైదరాబాద్: ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్‌ను కస్టమర్ కుక్క భయపెట్టింది. అతని వైపు దూకడంతో భయంతో పరుగు లంకించుకుని మూడో అంతస్తు నుంచి ఆ డెలివరీ బాయ్ కిందికి దూకేశాడు. ప్రాణాలు కాపాడుకోవాలని దూకేసిన ఆ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ చికిత్స పొందుతూ మరణించాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పరిస్థితులు విషమించి ప్రాణాలు వదిలాడు.

హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మొహమ్మద్ రిజ్వాన్ స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఓ ఫుడ్ డెలివరీ చేయడానికి ఆయన బంజారా హిల్స్‌లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. లుంబిని రాక్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తన కస్టమర్ కే శోభనకు డెలివరీ అందించడానికి తలుపు తట్టాడు. ఫ్లాట్ డోర్ తీసిన ఆమె వెంటే పెంపుడు కుక్క (జర్మన్ షెఫర్డ్) వచ్చింది. అతడిని చూసి మొరిగింది. ముందుకు దూకుతూ బెదిరించింది. 

ఆ కుక్క భయంతో రిజ్వాన్ దూరంగా జరిగాడు. మరోసారి కుక్క మొరిగి అటు వైపుగా అడుగు వేయడంతో పరుగున వెళ్లాడు. వెంటనే మూడో అంతస్తు అని కూడా చూడకుండా కిందికి దూకేశాడు. అతడిని వెంటనే నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు తరలించారు. క్రిటికల్ కండీషన్‌లోనే అతడిని అడ్మిట్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రాణాలు విడిచాడు. 

Also Read: కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్.. హైద‌రాబాద్ లో షాకింగ్ ఘ‌ట‌న

బంజారా హిల్స్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎం నరేందర్ మాట్లాడుతూ, ‘రిజ్వాన్ తన కస్టమర్ కు పార్శిల్ అందిస్తుండగా ఆమె పెంపుడు కుక్కు ఇంటి నుంచి బయటకు వచ్చి అతనిపై ఎగిరి దూకింది. తనపై దాడి చేస్తుందేమో అనే భయంతో రిజ్వాన్ పరుగు పెట్టాడు. కుక్క అతడి వెంట పరుగు తీసింది. దీంతో మూడో అంతస్తు నుంచి రిజ్వాన్ కిందికి దూకేశాడు’ అని తెలిపారు.

చికిత్స పొందుతూనే శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో మొహమ్మద్ రిజ్వాన్ మరణించాడని ఆ పోలీసు అధికారి చెప్పారు. కేసును ఐపీసీలోని సెక్షన్ 304 (ఏ)కు మార్చామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

click me!