హిందువైనా.. ముస్లిమైనా..! సువేందు అధికారి వ్యాఖ్యలతో దుమారం, బీజేపీ వైఖరికి భిన్నంగా..

By Mahesh KFirst Published May 29, 2023, 8:49 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ రోజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను లేవనెత్తాయి. దేశ సరిహద్దు గుండా అక్రమంగా మన దేశంలోకి వచ్చిన వారెవరైనా.. హిందువైనా, ముస్లిం అయినా తిరిగి పంపించాలన అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ వైఖరికి భిన్నంగా ఉండటంతో చర్చనీయాంశమయ్యాయి.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సోమవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీలోనూ, అధికార టీఎంసీలోనూ తీవ్ర చర్చను లేవదీశాయి. ఆయన బీజేపీ వైఖరికి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. హిందువైనా, ముస్లిమైనా దేశ సరిహద్దు గుండా అక్రమంగా లోనికి వస్తే.. వారిని ఆ సరిహద్దు ఆవలకు పంపించేయాలని అన్నారు.

మాల్డాలో నిర్వహించిన ఓ సభలో సువేందు అధికారి ప్రసంగించారు. సరిహద్దులోని కంచె దాటి మన దేశ భూభాగంపై అక్రమంగా అడుగు పెట్టిన వారిని తిరిగి కంచె బయటకు పంపించేయాలని అన్నారు. వారు హిందువైనా, ముస్లిం అయినా సరే అని పేర్కొన్నారు. అదే భారత్‌లో పుట్టి జాతీయవాదాన్ని విశ్వసించి జాతీయ గీతాన్ని ఆలపించిన వారిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించదు అని తెలిపారు.

సువేందు అధికారి బీజేపీ వైఖరికి భిన్నమైన స్వరం ఎంచుకోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. సాధారణంగా బీజేపీ హిందువులను, ముస్లింలను వేరుగా ట్రీట్ చేస్తున్నది. ముస్లింలను చొరబాటుదారులుగా, హిందువులను శరణార్థులగా బీజేపీ భావిస్తున్నది. కానీ, సువేందు అధికారి ఈ వైఖరికి భిన్నంగా మాట్లాడారు. హిందువైనా, ముస్లిం అయినా కంచె దాటి వస్తే చొరబాటుదారులగానే గుర్తిస్తామనేలా కామెంట్ చేశారు.

Also Read: Asianet News Dialogues: భూమి చుట్టూ సముద్రయానం చేసిన అభిలాష్ టామీ.. 30 వేల మైళ్ల జర్నీ గురించి ముఖ్యాంశాలు

దీనిపై టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోల్ ట్వీట్ చేశారు. ఆయన భాషను సరిగ్గా వినండి అని ట్వీట్ చేశారు. ఆ కంచె దాటి వస్తే వెనక్కి పంపిస్తామని అంటున్నారు. వారు హిందువైనా, ముస్లిమైనా సరే అని చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీది కూడా ఇదే అభిప్రాయమా? అని ప్రశ్నించారు.

click me!