రాఫేల్‌పై తీర్పు రిజర్వ్: సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

Siva Kodati |  
Published : May 10, 2019, 05:44 PM IST
రాఫేల్‌పై తీర్పు రిజర్వ్: సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

సారాంశం

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ముగిసింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు విన్న అత్యున్నత న్యాయస్ధానం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ముగిసింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు విన్న అత్యున్నత న్యాయస్ధానం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

తొలుత వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్... కేంద్రప్రభుత్వం లేవనెత్తిన అనేక అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో కంటికి కనిపించని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని.. నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

కీలకమైన సమాచారాన్ని ప్రభుత్వం న్యాయస్ధానానికి సమర్పించలేదని, కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా సుప్రీం డిసెంబర్ 14న తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. 8 కీలక నిబంధనలను పక్కనబెట్టి రఫేల్‌కు సంబంధించిన సీసీఎస్ సమావేశం నిర్వహించారని ప్రశాంత్ న్యాయస్ధానం దృష్టికి తీసుకొచ్చారు.

అంతర్జాతీయ సంప్రదింపుల బృందంలోని సభ్యుల్లో ముగ్గురు రాఫెల్ పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేశారని ప్రశాంత్ తెలిపారు. 5 బిలియన్ యూరోలకు బెంచ్ మార్క్ ధర నిర్ణయించినా చివరి ఒప్పందంలో బెంచ్ మార్క్ పైన 55.6 శాతానికి ధరను పెంచారని అన్నారు.

అనిల్ అంబానీ, ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ మధ్య భేటీ కూడా కొత్త నిజాల్లో ఒకటన్నారు. ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించిన తర్వాత మరో పిటిషనర్ అరుణ్ శౌరి న్యాయస్ధానం ఎదుట తన వాదనల్ని వినిపించారు.. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు.

ఈ ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని తెలిపారు. కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే సుప్రీంకోర్టు గతంలో తీర్పును వెలువరించిందని అరుణ్ గుర్తు చేశారు.

అనంతరం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ధరలను బహిర్గతం చేయరాదన్నారు. పిటిషనర్లు పదే పదే ధరల అంశంపైనే వాదనలు వినిపిస్తున్నారని వేణుగోపాల్ తెలిపారు.

రాఫేల్ తాజా ఒప్పందం చౌకైందిగా కాగ్ తేల్చిందని... యుద్ధ విమానాలు అలంకారం కోసం కాదని.. దేశ భద్రత కోసమన్నారు. ప్రపంచంలో ఏ కోర్టు కూడా రక్షణ ఒప్పందాలపై విచారణ జరపదని వేణగోపాల్ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu