భారత ఒలింపిక్ అసోసియేషన్ రాజ్యాంగ సవరణకు మాజీ జడ్జీ నాగేశ్వరరావు నియామకం.. డిసెంబర్‌లో ఎన్నికలు!

By Mahesh KFirst Published Sep 22, 2022, 6:29 PM IST
Highlights

భారత ఒలింపిక్ అసోసియేషన్‌లో రాజ్యాంగ సవరణ కోసం మాజీ జడ్జీ నాగేశ్వరరావును సుప్రీంకోర్టు గురువారం నియమించింది. డిసెంబర్ 15లోపు ఐవోఏ జస్టిస్ నాగేశ్వరరావు సహయంతో ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: భారత్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) రాజ్యాంగ సవరణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వర రావును సుప్రీంకోర్టు గురువారం నియమించింది. అసోసియేషన్‌లో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన విధానాలను ఆయన పర్యవేక్షణలో రూపొందించాలని ఆదేశించింది. 

సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఐవోసీ రాజ్యాంగ సవరణకు అవసరమైన సిఫారసులను, సలహాలను మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు చేస్తారని ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీలోపు ఐవోఏ ఎన్నికలు జరుపుకోవడానికి సహకరిస్తారని వివరించింది.

అలాగే, ఈ నెల 27వ తేదీన లాసనేలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహించనున్న సమావేశానికి భారత్ తరఫున ఐవోఏ సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా, ఐవోఏ ప్రెసిడెంట్ సుమారివాలా హాజరు కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఐవోఏ రాజ్యాంగ మార్పులు, ఐవోఏ ఎలక్టోరల్ కాలేజీ వంటివి నిర్ణయించడానికి జస్టిస్ రావు‌కు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపింది. భారత యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వీటిని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఐవోఏలో పాలనా పరమైన సమస్యలను పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ నెల 8వ తేదీన భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. లేదంటే.. ఒలింపిక్ క్రీడల్లో నుంచి భారత్‌ను బ్యాన్ చేస్తామని హెచ్చరించింది.

నిర్దేశిత సమయంలోపు ఐవోఏ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే.. ఒలింపిక్ క్రీడలకు అర్హులైన భారత క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించకుండా వ్యక్తిగతంగా పాల్గొనాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. వారు.. ఒలింపిక్ క్రీడల్లో భారత్ జెండాను కాకుండా.. ఒలింపిక్ జెండాను పట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

click me!