ఎంపీల కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయం

By Nagaraju TFirst Published Dec 18, 2018, 3:57 PM IST
Highlights

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల వ్యవహారాల శైలిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాఫేల్‌ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె మీ కంటే స్కూల్‌ పిల్లలు ఎంతో నయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల వ్యవహారాల శైలిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాఫేల్‌ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె మీ కంటే స్కూల్‌ పిల్లలు ఎంతో నయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

రాఫేల్‌ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలకు దిగారు. ఇరుపార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో గందరగోళం చెలరేగింది.

దీంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్‌ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.

ఎంత చెప్పినా ఎంపీల తీరు మారకపోవడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీల ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్‌లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. 

పార్లమెంటేరియన్ల కంటే స్కూల్‌ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. రాఫేల్‌ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. 

ఇక రాఫేల్‌ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్‌ గాంధీయే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఏఐఏడీఎంకే సభ్యులు సైతం ఆందోళన చేపట్టారు. కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని వారు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో వాయిదాల పర్వం కొనసాగింది.

click me!