కరుణ అంత్యక్రియలపై పళనిస్వామి రాజకీయం వెనుక..?

First Published Aug 9, 2018, 3:32 PM IST
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్త తమిళనాడు తల్లడిల్లిపోయ్యింది.ఇంతటి విషాద సమయంలో ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేసిన ఎత్తుగడ రాజకీయంగా ఆయన ప్రతిష్టను దిగజార్చింది. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్త తమిళనాడు తల్లడిల్లిపోయ్యింది. ద్రవిడ ఉద్యమ నేతగా, ఆరు దశాబ్ధాల పాటు తమిళ సినీ, కళా, సాహిత్య, రాజకీయ రంగాలపై కరుణానిధి ముద్ర తిరుగులేనిది. అంతటి కురువృద్ధుడు మరణంతో ఆ రాష్ట్రం పెద్ద దిక్కును కోల్పోయింది. ఇంతటి విషాద సమయంలో ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేసిన ఎత్తుగడ రాజకీయంగా ఆయన ప్రతిష్టను దిగజార్చింది. 

కరుణ మరణం తర్వాత అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి వెనుక ప్రాంతంలో నిర్వహించాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి పళని సర్కార్ అభ్యంతరం తెలిపింది.. పదవిలో ఉన్న ముఖ్యమంత్రులకు తప్పించి.. మాజీ సీఎంల స్మారకాలకు అక్కడ స్థానం లేదని వాదించింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల ఉదంతాలను గుర్తు చేసింది. దీనిపై కరుణానిధి అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరీ ఆసుపత్రి ప్రాంగణం, డీఎంకే కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. 

అప్పటికప్పుడు న్యాయస్థానంలో పిటిషన్ వేసి.. న్యాయపోరాటానికి దిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ప్రోటోకాల్ కన్నా ప్రజల మనోభావాలే గొప్పవని తేల్చి చెప్పి.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతినిచ్చింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉంటూ.. ఎలాంటి వివాదం లేని పళనిస్వామి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని విశ్లేషకులు సైతం అయోమయానికి గురయ్యారు. దీని వెనుక వారికి ఒక కారణం కనిపిస్తోంది.. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ రాజకీయంగా ఎదిగేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. 

దీనిలో భాగంగా పళని.. పన్నీర్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న వారిని గాలం వేస్తున్నట్లుగా పళనికి నివేదికలు అందాయి. ఈ పరిణామాలతో అప్రమత్తమైన సీఎం తన నాయకత్వంపై అయిష్టంగా ఉన్న వారి దృష్టి మరల్చడానికి కరుణ అంత్యక్రియలపై రాజకీయం చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి నిర్ణయంపై తమిళ సమాజంతో పాటు దేశంలోని ఇతర రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని పార్టీలు, అభిమానులు, సినీ తారలు డీఎంకేకు మద్ధతుగా నిలిచాయి. 

తమిళనాడు కోసం జీవితాంతం శ్రమించిన పెద్దాయనకి ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ మండిపడ్డాయి. చివరకు దినకరన్ కూడా ‘‘కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడలేను’’ అని చెప్పడంతో పళని వ్యూహం బెడిసి కొట్టినట్లయ్యింది.

ప్రజల ఒత్తిడికి తలొగ్గిన ముఖ్యమంత్రి కోర్టు తీర్పు కంటే ముందే కరుణ అంత్యక్రియలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ అప్పటికే అన్నాడీఎంకేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనవసర తప్పిదానికి పాల్పడిన పళనిస్వామి పార్టీ ప్రతిష్టను మంటగలిపారని విశ్లేషకులు అంటున్నారు. ఈ అంశాన్ని భవిష్యత్తులో డీఎంకే, టీటీవీ దినకరన్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు.

click me!