దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. దుర్గాపూజ వేడుకల్లో పాల్గొన్న భక్తుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు మృతి చెందారు. తొక్కిసలాటలో ఈ దారుణం జరిగింది.
పాట్నా : దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా, ఉత్సాహంతో చేసుకున్నారు. కాగా, కొన్నిచోట్ల దసరా ఉత్సవాల్లో అపశృతులు చోటుచేసుకున్నాయి. బీహార్లో దుర్గాపూజ మండపం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురిలో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. దుర్గా పూజ మండపం దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరో 10 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం రాత్రి గోపాల్ గంజ్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది.
బీహార్ లోని పాట్నా రాజాదళ్ ప్రాంతంలో దుర్గాపూజ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే, ఎక్కువ మంది భక్తులు ఒకేసారి గుమి గూడడంతో రద్దీ ఎక్కువై మండపం దగ్గర తొక్కిసలాట ఏర్పడింది. ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో వారిని అక్కడున్న నిర్వాహకులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో ఐదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
గోపాల్గంజ్ ఎస్పి స్వర్ణ ప్రభాత్ దీని గురించి మాట్లాడారు. రాజా దళ్ ఏరియాలో ఏర్పాటు చేసిన దుర్గా పండల్ దగ్గర సోమవారం రాత్రి 8:30 ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ తొక్కిసలాటలో ఓ బాలుడు అనుకోకుండా కింద పడిపోయాడు. అతడిని కాపాడడానికి ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారు కూడా కింద పడడంతో… తొక్కిసలాటలో మృతి చెందారు. ప్రసాదం కోసం భక్తులు బారులు తీరడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.
తొక్కిసలాటలో ఊపిరాడక బాలుడితో సహా ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే గమనించిన మిగతావారు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరింత ఉద్రిక్తంగా పరిస్థితి మారకుండా నియంత్రించారు. ఈ తొక్కిసలాటలో మరో పదిమందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. మండపం దగ్గర భక్తులను నియంత్రించడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని.. దీనివల్లే తొక్కిసలాట ఎక్కువైందని పోలీసులు తెలిపారు.