స్టాలిన్ విజయం: చంద్రబాబు, కేసీఆర్ చేయాల్సింది అదే...

By team teluguFirst Published May 2, 2021, 6:19 PM IST
Highlights

తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ విజయం సాధించాడు. స్టాలిన్ విజయం... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా వ్యవహరించే కుటుంబ పార్టీలన్నిటి ఒక మంచి పాఠం నేర్పుతుంది. 

తమిళనాడు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగానే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతుంది. డీఎంకే రౌండ్ రౌండ్ కి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ దూసుకుపోతుంది. అధికారికంగా డీఎంకే విజయం సాధించిందని ఎన్నికల సంఘం ప్రకటించడమే తరువాయి. ఈ తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ ఈ స్థాయి విఅజయ్మ్ సాధించడానికి, అన్నాడీఎంకే ఇంత ఘోర ఓటమి చెందడానికి ఒకటే కారణం. అదే సరైన సమయంలో నాయకత్వ మార్పు జరగకపోవడం. ఇప్పుడు దీని నుండి మన తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబ పార్టీలు కూడా నేర్చుకోవాలి, లేకపోతే అడ్రస్ గల్లంతయ్యే ఆస్కారం లేకపోలేదు . 

ఈ తమిళనాడు ఎన్నికలు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే లకు వారి వారి సుప్రీమ్ నాయకులైన కరుణానిధి, జయలలిత లేకుండా ఎదుర్కున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు. తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ విజయం సాధించాడు. స్టాలిన్ విజయం... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా వ్యవహరించే కుటుంబ పార్టీలన్నిటి ఒక మంచి పాఠం నేర్పుతుంది. 

కరుణానిధి, జయలలిత కొంత కాలం వ్యవధిలోనే మరణించారు. జయలలిత తాను మరణించే వరకు తన తర్వాత ఎవరు పార్టీని నడపబోతున్నారు అనే విషయంలో క్లారిటీతో లేరు. అప్పటికి జయ వయసు తక్కువే అవడం వల్ల జయ ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ కరుణానిధి మాత్రం తన తదుపరి వారసుడిగా స్టాలిన్ ని ప్రకటించాడు. 

స్టాలిన్ ని కరుణానిధి బ్రతికి ఉన్నప్పుడే ప్రకటించడం వల్ల ఆయన మీద వ్యతిరేకత ఏమైనా ఎదురైనా దానిని కరుణానిధి అడ్రస్ చేసారు. కానీ ఒక్కసారిగా జయలలిత వెళ్లిపోవడంతో ఏర్పడ్డ ఆ గ్యాప్ ని ఎవరూ కూడా పూడ్చలేకపోయారు. ఈపీఎస్, ఓపిఎస్ ల మధ్య వర్గ విభేదాలు, శశికళ ఉదంతం అన్ని వెరసి అన్నాడీఎంకే పార్టీ ముక్కలవుతుందని అంతా భావించారు. కానీ ఏదో బ్రతికి బట్టగట్టినప్పటికీ... అందులోని వర్గ విభేదాలు ఇప్పుడు ఓటమికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు. 

మరోపక్క స్టాలిన్ ని నాయకుడిగా అంతా గుర్తించారు. తదుపరి వారసుడిగా అంగీకరించారు. అన్నాడీఎంకే విషయంలో అది జరగలేదు. దీని నుండి మన తెలుగు రాష్ట్రాల్లోని తెరాస, టీడీపీలు కూడా నేర్చుకోవాలి. తెరాస ఇప్పటికే ఇందుకు తగ్గట్టుగా పావులు కదుపుతుంది. కేటీఆర్ పట్టాభిషేకం అని చాలా సార్లు వార్తలు వచ్చినా అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. 

ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకొని కేటీఆర్ కి పగ్గాలప్పజెప్పి, అసమ్మతి ఏమైనా ఎదురైతే కేసీఆర్ చూసుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి కేసీఆర్ ఇందుకోసమే కేటీఆర్ అనుకూల కాబినెట్ ని తాయారు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈటలను సాగనంపే ఏర్పాట్లు జరిగాయని అంటున్నారు. మరొక అంశం హరీష్ రావు. ఆ ఫాక్టర్ ని ఎలా టాకిల్ చేస్తారో చూడాలి. 

ఇక ఏపీలో స్టాలిన్ నుంచి టీడీపీ నేర్చుకోవాలి. లోకేష్ ని ఇంకా పూర్తిస్థాయిలో చంద్రబాబు వారసుడిగా భవిష్యత్ పార్టీ అధ్యక్షుడిగా అంగీకరించేలేకపోతున్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ వినబడుతోంది. ఈ విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యను గట్టెక్కగలడు లేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారవచ్చు.

click me!