ఫస్ట్ డోసూ వేసుకోని సిబ్బందికి సెలవులు.. వేసుకునే వరకు ఆఫీసుకు వద్దు: ప్రభుత్వం కీలక నిర్ణయం

By telugu teamFirst Published Sep 10, 2021, 5:38 PM IST
Highlights

ఇప్పటి వరకు కనీసం తొలి డోసైనా తీసుకోని ప్రభుత్వ సిబ్బందిని తప్పనిసరి సెలవుల కింద పంజాబ్ ప్రభుత్వం ఇంటికి పంపనుంది. తొలి టీకా వేసుకునే వరకు వారు సెలవుల్లోనే ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్ కారణాలతో టీకా తీసుకోనివారికి మినహాయింపు ఉంటుందని తెలిపింది. శుక్రవారం నాటి ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

చండీగడ్: టీకాపై సంశయాలు వీడి అర్హులైనవారంతా వేసుకోవాలని ప్రభుత్వాలు మొదటి నుంచి చెబుతున్నాయి. కరోనా నుంచి రక్షించే ఏకైక సంజీవని టీకానే అని పలుసార్లు స్పష్టం చేశాయి. అయినప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్‌పై భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రికార్డు స్థాయిలో జనాలు టీకా వేసుకోవడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం కొంత కఠినమైన నిర్ణయమే తీసుకుంది.

మెడికల్ రీజన్స్ మినహా మరే ఇతర కారణాల ద్వారానైనా సెప్టెంబర్ 15లోపు టీకా తొలి డోసు కూడా తీసుకోనివారుంటే వారిని కంపల్సరీ సెలవుల కింద పంపిస్తామని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా వేసుకోని ప్రభుత్వ సిబ్బంది కోసం అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. అయినప్పటికీ టీకా తీసుకోవడానికి ఇష్టపడనివారిని సెలవులపై పంపిస్తామని, వారు ఫస్ట్ డోసు వేసుకునేవరకు సెలవుల్లోనే ఉంచుతామని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు. భయపడుతూ టీకా వేసుకోనివారి కోసం టీకా తీసుకున్నవారెందుకు మూల్యం చెల్లించుకోవాలని భావించినట్టు తెలిపారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్టు వివరాలు వెల్లడిస్తున్నాయని సీఎం సింగ్ వివరించారు.

click me!