దేశంలో కరోనా (corona virus) మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 628 కొత్త కోవిడ్ -19 (covid -19) కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జేఎన్.1 వేరియంట్ (JN.1 Variant) కేసులు 63 ఉన్నాయి.
దేశంలో కోవిడ్ -19 కలవర పెడుతోంది. చాలా కాలం వరకు సైలెంట్ గా ఉన్న ఈ మహమ్మారి.. మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్ లో ఒక్క రోజులోనే 628 కొత్త కోవిడ్ -19 కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054 కు చేరుకుంది. కొత్త గా వెలుగులోకి వచ్చిన జేఎన్.1 వేరియంట్ కు సంబంధించిన 63 కేసులను గుర్తించారు.
మంగళవారం ఉదయం 8 గంటలకు అప్ డేట్ చేసిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కేరళలో కోవిడ్ వల్ల ఒక కొత్త మరణం సంభవించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,334 (5.33 లక్షలు)కు చేరుకుంది. తాజా కేసులతో కలిసి ప్రస్తుతం దేశంలో కోవిడ్ బారిన వారిన సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు)కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు)కు పెరిగిందని, జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 125 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదైన 125 కేసుల్లో 94 రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ రోజువారీ బులెటిన్లో పేర్కొంది. 30 మంది కోలుకోకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 436కు చేరుకుంది. అయితే ఇందులో 360 బెంగళూరులోనే ఉన్నాయి.
మైసూరులో 13, దక్షిణ కన్నడ, హసన్లో 5 చొప్పున, శివమొగ్గ, విజయనగర్లో 2 చొప్పున, బళ్లారి, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, దావణగెరె జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని దాదాపు 20 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అలాగే కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ కేసులో కూడా ఈ దక్షిణాది రాష్ట్రంలోనే అత్యధికంగా వెలుగులోకి వచ్చాయి. దేశంలో నమోదైన కొత్త జేఎన్.1 కేసుల్లో 34 కేసులు ఎక్కడే గుర్తించారు.
ఇందులో బెంగళూరు నగరంలో 20 కేసులు ఉన్నాయి. మైసూరులో 4, మండ్యలో 3, రామనగర, బెంగళూరు రూరల్, కొడగు, చామరాజనగర్ లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. కాగా.. కర్ణాటకలో ఇప్పటి వరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 40.89 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 2.4 శాతంగా నమోదు కాగా, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మరణాల సంఖ్య 40,324గా ఉంది. కాగా.. కర్ణాటకలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ఆరోగ్య శాఖ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. కోవిడ్ నివారణకు చర్యలు ప్రారంభించింది.