నిత్యానంద స్వామి చనిపోయారా?.. వదంతులపై సంచలన పోస్టు

By Mahesh KFirst Published May 13, 2022, 9:37 PM IST
Highlights

నిత్యానంద స్వామి చనిపోయారా? సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ విషయమై తీవ్ర రచ్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే నిత్యానంద స్వామి స్వయంగా ఈ విషయంపై స్పందించారు. తాను బతికే ఉన్నారని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: మన దేశంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరణించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ వార్తలపై స్వయంగా నిత్యానంద స్వామి స్పందించారు. తాను చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నారని స్ఫష్టం చేశారు. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స అందిస్తున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేశారు.

ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో నిత్యానంద స్వామి ఉంటున్నట్టు వార్తలు ఉన్నాయి. అయితే, ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వదంతులు ప్రచారం అయ్యాయి. దీంతో కొన్నాళ్లుగా భక్తుల్లో ఆందోళన చెలరేగింది. ఈ గందరగోళం నేపథ్యంలో స్వామి నిత్యానంద స్వయంగా ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. తాను మరణించలేదని ఆయన తెలిపారు. అయితే, తాను సమాధిలోకి వెళ్లారని వివరించారు. శిష్యులు ఖంగారు పడొద్దని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. అంతేకాదు, ప్లేసులను, మనుషులను గుర్తు పట్టలేకపోతున్నారని వివరించారు. ఫేస్‌బుక్ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు.

‘నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో సుప్తావస్తలో ఉన్నాను. నేను మరణించినట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ వదంతులను నమ్మవద్దు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. ప్రాంతాలను, మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాను. తనకు 27 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారు’ అని వివరించారు.

నిత్యానంద స్వామి మన దేశంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఆయన కోర్టు కేసుల్లో హాజరయ్యారు. 2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు ఆయన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవిని స్వయంగా ఆయన కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దానికి ఆయన కైలాస దీవి అనే పేరు పెట్టారు. ఆ కైలాస దీవికి ఆయనే ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు. అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు. కైలాస డాలర్‌ను ఆయన తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ఆయన ప్రారంభించారు.

అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయంపై స్పష్టత లేదు. కానీ, ఆయన వివరాలు మాత్రం అంతర్జాలంలోని వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటున్నారు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిలో ఆయన నివాసం ఉంటున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండించడం గమనార్హం. అయితే, కైలాస కొంత కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఫేస్‌బుక్‌లో ఆయన మరణాన్ని ఖండిస్తూ ప్రకటన వచ్చినా.. నిజంగా నిత్యానంద స్వామి బతికే ఉన్నారా? లేక మరణించారా? అనే విషయం మిస్టరీగానే ఉన్నది.

click me!