మిత్రపక్షాల నాయకులతో సోనియా గాంధీ ముచ్చట్లు.. అక్కడే అఖిలేష్ యాదవ్.. సరికొత్త చర్చ..?

Published : Apr 03, 2022, 11:10 AM IST
మిత్రపక్షాల నాయకులతో సోనియా గాంధీ ముచ్చట్లు.. అక్కడే అఖిలేష్ యాదవ్.. సరికొత్త చర్చ..?

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీ‌లో డీఎంకే కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన సోనియా గాంధీ.. అక్కడికి వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలతో ముచ్చటించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నాయకులతో పాటు సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కూడా సోనియా మాట్లాడారు. 

దేశ రాజధాని ఢిల్లీ‌లోని దీనదయాళ్‌ మార్గ్‌లో డీఎంకే కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్‌ అబ్దుల్లా సహా ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలు మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎంకే కార్యాలయం ప్రారంభోత్సవంలో సోనియా గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

ఈ ప్రారంభోత్సవానికి హాజరైన సోనియా గాంధీ.. అక్కడికి వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలతో ముచ్చటించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నాయకులతో పాటు సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కూడా సోనియా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, ఢిల్లీలో డీఎంకే కార్యాలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, టీఎంసీ, టీడీపీ, సీపీఐ, బీజేడీ, ఎస్‌ఏడీ.. పార్టీలకు చెందిన నాయకులు కూడా హాజరయ్యారు. టీఎంసీ నుంచి మహువా మోయిత్రా,  టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, సీపీఐ నుంచి డి రాజా, బీజేడీ నుంచి అమర్ పట్నాయక్, ఎస్‌ఏడీ నుంచి Harsimrat Badal..  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.తమిళనాడు ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, డీఎంకే ఎంపీలు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులను స్టాలిన్‌ శాలువలతో సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. ఆ తర్వాత సోనియా గాంధీ, ఇతర పార్టీల నేతలతో కలిసి జ్యోతిప్రజ్వలనం చేశారు. కార్యాలయంలో రెండో అంతస్థులో అన్బళగన్‌ స్మారక గ్రంథాలయాన్ని సోనియాగాంధీ ప్రారంభించారు.  ఇక, డీఎంకే కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో..  ‘అన్నా-కలైంజర్‌ అరివాలయం’ అని నామకరణం చేసిన కొత్త కార్యాలయాన్ని ద్రవిడ కోటగా అభివర్ణించారు స్టాలిన్. 

బీజేపీ వ్యతిరేక కూటమి..?
ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో..  సోనియా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా సహా ప్రతిపక్ష పార్టీల నేతలు డీఎంకే కార్యాలయం ప్రారంభోత్సవంలో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇటీవల ఐదు రాష్ట్రాలలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్.. పార్టీ నేతలతో కొన్ని  కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకులు ఒకే వేదికగా కలవడంతో.. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇటీవలి ఘోర పరాభవం తర్వాత.. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో జరగనున్న ఎన్నికలకు ముందు సోనియా గాంధీ.. డ్యామేజ్ కంట్రోల్‌ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రతిపక్ష నేతల వ్యక్తిగత ఆశయాలే బీజేపీ తిరుగులేని విజయానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల మమతా బెనర్జీ విపక్ష పార్టీల సీఎంలకు, నేతలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రగతిశీల శక్తులు" కలిసి రావాలని, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. త్వరలోనే వీలు చూసుకుని ఓ సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో మమతా బెనర్జీ.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. అయితే.. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష ఫ్రంట్ సాధ్యం కాదని ఎన్సీపీ, శివసేన రెండూ స్పష్టం చేశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu