సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్.. మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి..

By Sumanth KanukulaFirst Published Aug 13, 2022, 12:52 PM IST
Highlights

కాంగ్రెస్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పలువురు ముఖ్య నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

కాంగ్రెస్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పలువురు ముఖ్య నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. సోనియాకు ఈరోజు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు Jairam Ramesh ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. . ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం సోనియా గాంధీ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఇక, మూడు నెలల వ్యవధిలో సోనియా కరోనా బారిన పడటం ఇది రెండో సారి. 

ఈ ఏడాది జూన్ 2వ తేదీన సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే తొలుత వైద్యుల సూచనలతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న సోనియా గాంధీ.. జూన్ 12వ తేదీన  కోవిడ్ సంబంధిత సమస్యలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల పాటు చికిత్స అనంతరం.. జూన్ 20వ తేదీన ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా  ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సోనియాకు సూచించినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరయ్యారు. మూడు రోజులు ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నేతలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మరుసటి రోజే.. కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగా వెల్లడించారు. 
 

click me!