
గోరఖ్‌పూర్ : కారణమేదైనా మనిషిని.. మనిషి చంపుకోవడానికి వెనకాడడం లేదు. చంపేసీ ఊరుకోవడం లేదు. శరీరాన్ని ముక్కలుగా నరికి అత్యంత భయానక పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోనే ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తి సొంత తండ్రినే చంపేశాడు. ఆ తరువాత అత్యంత కిరాతకంగా శరీరాన్ని ముక్కలుగా నరికి.. పారేశాడు
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తి తన 62 ఏళ్ల తండ్రిని దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు ఆదివారం పోలీసులు వివరాలు తెలిపారు. తండ్రిని హత్య చేసిన తరువాత, 30 ఏళ్ల నిందితుడు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి, పారేయాలనుకున్నాడు. దీనికోసం శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఆ తరువాత సూట్ కేసులో పెట్టి, ఇంటివెనకున్న వీధిలో పడేశాడు.
ఈ ఘటన తివారీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. నిందితుడి సోదరుడు ప్రశాంత్ గుప్తా ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన ఆ వ్యక్తిని నిందితుడి తండ్రి మురళీ ధర్ గుప్తాగా గుర్తించారు.
సంతోష్ కుమార్ గుప్తా అలియాస్ ప్రిన్స్‌గా గుర్తించబడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ బిష్ణోయ్ తెలిపారు. కుటుంబంలో ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని తెలిపారు. "తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని గుర్తించిన నిందితుడు.. అతనిపై సుత్తితో దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై సోదరుడి గది నుండి సూట్‌కేస్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. సూట్‌కేస్‌లో పెట్టాడు. ఆ సూట్ కేస్ ను ఇంటి వెనుక వీధిలో దాచాడు".
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కుదరదు.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
నిందితుడి సోదరుడి సమాచారం మేరకు పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారని అధికారి తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసి15 ముక్కలుగా నరికాడు. ఆ తరువాత మంటూరు బైపాస్ రోడ్డు సమీపంలోని పొలంలో ఉన్న బోరుబావిలో తండ్రి శరీర భాగాలను పడేశాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మృతుడు పరశురామ్ కులాలి (54), నిందితుడిని విఠల్ కులాలిగా గా గుర్తించారు. డిసెంబరు 6న ముధోల్‌లో ఈ ఘటన జరిగింది. భర్త కనిపించకపోవడంతో మృతుడి భార్య పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. దీని మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితుడు విఠల్ నేరం అంగీకరించాడని బాగల్‌కోట్ ఎస్పీ జయప్రకాష్ తెలిపారు. మృతుడు పరశురాంకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 53 ఏళ్ల పరశురాం మద్యానికి బానిసై తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన విఠల్ ను నిత్యం దుర్భాషలాడేవాడు. పరశురాం భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. డిసెంబర్ 6న పరశురాం మద్యం మత్తులో కుమారుడితో వాగ్వాదానికి దిగాడు.
ఆవేశానికి లోనైన 20 ఏళ్ల కొడుకు ఇనుప రాడ్డుతో తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. తండ్రిని చంపిన తరువాత మృతదేహాన్ని ఉపయోగంలో లేని బోరుబావిలో దాచడానికి ప్రయత్నించాడు. కానీ బోరుబావి వెడల్పు 6-8 అంగుళాలు మాత్రమే ఉండటంతో అది చేయలేకపోయాడు. దీంతో విఠల్ తండ్రి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు. మృతుడి భార్య సరస్వతి గత కొన్నేళ్లుగా పెద్ద కుమారుడితో కలిసి విడివిడిగా ఉంటుంది. కాగా విఠల్, పరశురాం ఒకే ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం.