భార్యాభర్తల మధ్య గొడవ: సాఫ్ట్ వేర్ ఇంజనీరు మృతి, భార్య అరెస్టు

By telugu teamFirst Published Jun 20, 2021, 10:18 AM IST
Highlights

గురుగ్రామ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పని ఒత్తిడి కారణంగా సమయం ఇవ్వకపోవడంతో భార్య భర్తపై గొడవ పడుతూ వస్తోంది. చివరిిక అది అతని మృతికి, ఆమె అరెస్టుకు దారి తీసింది.

గురుగ్రామ్: భార్యాభర్తల మధ్య గొడవ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు మృతికి, అతని భార్య అరెస్టుకు దారి తీసింది. పరిమితికి మించిన గంటలు పనిచేయడం వల్ల ఆ పరిణామం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. శుక్రవారంనాడు గుంజన్, సచిన్ కుమార్ దంపతుల మధ్య గొడవ జరిగింది. అది ఘర్షణకు దారి తీసింది.

సచిన్ కు ఛాతీపై బలమైన కత్తి గాయం అయింది. సచిన్ ఎప్పుడు పని చేస్తూ తీరిక చేసుకోవడం లేదని, దాంతో కుటుంబానికి సమయం ఇవ్వడం లేదని, దాంతో తమ ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయని గుంజన్ పోలీసులకు చెప్పింది. 11 ఏళ్ల కూతురు ఆ ఘర్షణను కళ్లారా చూసింది. 8 ఏళ్ల కుమారుడు మరో గదిలో ఉన్నాడు. 

గొడవ తీవ్రం కావడంతో గుంజన్ వంటింట్లోని కత్తిని తీసుకుని పొడుచుకుంటానని బెదిరించింది. దాంతో సచిన్ కత్తిని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కత్తి అతని ఛాతీలో దిగబడింది. 

సచిన్ ఓ ఐటి కంపెనీలో పనిచేస్తుండగా, గుంజన్ ఎగుమతుల సంస్థలో పనిచేస్తోంది. వారికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. సచిన్ కుటుంబ సభ్యులు గురుగ్రామ్ లోని సెక్టార్ 7లో రెండంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు సచిన్ తమ్ముడు మొదటి అంతస్థులో ఉంటున్నాడు.

శుక్రవారం ఉదయం కింది నుంచి అరుపులు వినిపించడంతో తాను హుటాహుటిన కిందికి దిగానని సచిన్ సోదరుడు నీరజ్ చెప్పాడు. తాను దిగే సరికో తన అన్నయ్య కింద పడిపోయి ఉన్నాడని చెప్పాడు. సచిన్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మేదాంత ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. 

ప్రమాదవశాత్తు కత్తి సచిన్ ఛాతీలో దిగిందని గుంజన్ చెప్పింది. తాము ఫోరెన్సిక్ నివేదిక ద్వారా సాక్ష్యాలను రాబట్టామని, దంపతుల కూతురు సంఘటనకు ప్రత్యక్ష్య సాక్షి అని పోలీసులు చెప్పారు తన అన్నయ్యను చంపిందని వదినపై నీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

click me!