
Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో చట్టవిరుద్ధంగా బార్ నడుపుతోందనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగింది. తొలుత తన కుమార్తె ఎలాంటి బార్‌ను నిర్వహించడం లేదని తేల్చి చెప్పింది.
కాంగ్రెస్ చూపించిన పేపర్లలో తన కుమార్తె పేరు లేదని స్మృతి ఇరానీ అన్నారు. రాహుల్ గాంధీని తాను అమేథీలో ఓడించడమే.. తన కుమార్తె తప్పా అని అన్నారు. తన కూతురిపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలపై కోర్టులో కేసు వేస్తానని కేంద్రమంత్రి తెలిపారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై తాను పోటీ చేయడమే తన కూతురు తప్పా? అని స్మృతి ఇరానీ నిలదీశారు.
నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గాంధీలను ప్రశ్నిస్తోందనీ రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ గాంధీ కుటుంబానికి చెందిన ₹ 2,000 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను రక్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి ఇరానీ గత నెలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
కాంగ్రెస్ తన కుమార్తె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుందనీ, ఏదైనా తప్పు చేసినట్లయితే రుజువు చేయాలని అన్నారు. విపక్షాల ఆరోపణను కొట్టిపారేసిన ఆమె..న్యాయస్థానం, ప్రజల న్యాయస్థానంలో తేల్చుకుంటానని సవాల్ చేశారు. తన కూతురిపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలపై కోర్టులో కేసు వేస్తానని కేంద్రమంత్రి తెలిపారు. 2024లో మళ్లీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీకి ధైర్యం చెప్పారు. రాహుల్ గాంధీ మళ్లీ ఓడిపోతాడని, తాను హామీ ఇస్తున్నానని మంత్రి ఇరానీ అన్నారు.
మరోవైపు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె తరఫు న్యాయవాది కిరత్ నగ్రా మాట్లాడుతూ.. తన క్లయింట్ పేరుతో ఎలాంటి రెస్టారెంట్ లేదని, ఆమె ఎలాంటి రెస్టారెంట్ ను నిర్వహించడం లేదని అన్నారు. అలాగే.. ఆమెకు ఎటువంటి షోకాజ్ నోటీసు అందలేదని స్పష్టం చేశారు. తన క్లయింట్ తల్లి, ప్రముఖ రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీ రాజకీయ ప్రతిష్టను భంగం కలిగించడానికి పలువురు ప్రయత్నిస్తున్నారనీ, చాలా మంది స్వార్థ ప్రయోజనాలతో తప్పుడు, దురుద్దేశపూర్వకమైన, అవమానకరమైన సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారని, కాంగ్రెస్ ఆరోపణలను నిరాధారమని నాగ్రా అన్నారు. వాస్తవాలను ధృవీకరించకుండా.. అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమనీ, వారు తన క్లయింట్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నోటీసు ఇచ్చిన అధికారి బదిలీ చేయబడిందని ఆరోపించారు.
స్మృతి ఇరానీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు - పవన్ ఖేరా
ఈ విషయంపై పబ్లిసిటీ చీఫ్ పవన్ ఖేరా విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. గోవాలో అతని కుమార్తె నడుపుతున్న రెస్టారెంట్ మద్యం సేవించడానికి నకిలీ లైసెన్స్‌లను జారీ చేసిందని ఆరోపించబడింది. ఇది రాజకీయ ప్రతీకారం కోసం చేసిన ఆరోపణలు కావొచ్చు. కానీ సమాచార హక్కు (ఆర్‌టిఐ) కింద అందుకున్న సమాచారంలో వెల్లడైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె తన సిల్లీ సోల్స్ కేఫ్ & బార్ కోసం నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి 'బార్ లైసెన్స్' పొందారని ఆయన పేర్కొన్నాడు. అయితే.. లైసెన్స్ ఉన్న వ్యక్తి గత ఏడాది మేలో మరణించాడు. ఆంథోనీ ఆధార్ కార్డులో అతడు ముంబైలోని విలే పార్లే నివాసి అని తేలింది. ఆర్టీఐ కింద సమాచారం కోరుతూ న్యాయవాది వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా స్వీకరించారని తెలిపారు.