
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో మంగళవారం నాడు కూడ సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో విపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. విపక్షాల ఆందోళనల కారణంగా ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
అసోం, మిజోరం రాష్ట్రాల సరిహద్దు వివాదం కారణంగా చోటు చేసుకొన్న పోలీసు కాల్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్ లోక్‌సభలో వాయిదా తీర్మాణం ఇచ్చారు. మరో వైపు అదే పార్టీకి చెందిన మనిష్ తివారీ పెగాసెస్ అంశంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.లోక్‌సభ ప్రారంభం కాగానే పెగాసెస్ తో పాటు మిజోరం,అసోం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా చోటు చేసుకొన్న పరిణామాలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. వైసీపీ ఎంపీలు పోలవరం అంచనాల పెంపును ఆమోదించాలని నోటీసిచ్చారు. రాజ్యసభలో పెగాసెస్ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.