ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలరాంపూర్‌లో శనివారం తెల్లవారుజామున ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలరాంపూర్‌లో శనివారం తెల్లవారుజామున ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు, మరో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. శ్రీదత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషంభర్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నైనిటాల్‌లోని పేపర్ మిల్లులో పనిచేస్తున్న డియోరియా జిల్లాకు చెందిన సోను షా (28) శుక్రవారం సాయంత్రం తన భార్య, పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన గ్రామానికి బయలుదేరినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) కేశవ్ కుమార్ చెప్పారు.
శనివారం తెల్లవారుజామున విషంభర్‌పూర్ గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో.. సోను షా, అతని భార్య సుజావతి (25), వారి పిల్లలు రుచిక (6), దివ్యాన్షి (4), షా సోదరుడు రవి (18), సోదరి ఖుషి (13)లు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టుగా తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఇక్కడికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఇక, బాధితుల కారును ఢీకొన్న వాహనాన్ని గుర్తించి సీజ్ చేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.