
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత .. ఆ ప్రాంతంలో కాస్త ఉగ్రవాద చర్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇటీవల పాక్, చైనాలు భారత్ పై ఉగ్రదాడులకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా నివేదికలు కూడా అవే చెప్పుతున్నాయి. మళ్లీ ఉగ్రకార్యకలాపాలు మొదలయ్యాయని పేర్కొంటున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి దేశంలోకి పెద్దఎత్తున ఉగ్రవాదులు చొరబాట్లు జరిగే అవకాశముందని రిపోర్టులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో మందుగుండు, పేలుడు సామగ్రి కలకలం రేపింది. రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న రహదారిలో ఆదివారం (మార్చి 5) భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి లభ్యమైంది. రోడ్డు నిర్మాణ సమయంలో ఆరు హ్యాండ్ గ్రెనేడ్లు, 127 రౌండ్ల జనరల్ పర్పస్ మెషిన్ గన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. వార్తా సంస్థ PTI ప్రకారం.. మంజాకోట్ తహసీల్‌కు చెందిన మారుమూల నీలి గ్రామంలో లింక్ రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన సిబ్బంది మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మందుగుండు సామాగ్రి ఏ స్థితిలో దొరికిందో పోలీసు అధికారి చెప్పారు. భూమిలో పాతిపెట్టిన హ్యాండ్ గ్రెనేడ్లు లేదా మందుగుండు సామాగ్రి తుప్పు పట్టిన స్థితిలో ఉన్నాయని, వాటిని చాలా కాలం క్రితం పాతిపెట్టి ఉంటారని సూచిస్తున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) జాఫర్ రాథర్ తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌డిపిఓ తెలిపారు.
'ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం'
అంతకుముందు శనివారం (మార్చి 5) జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలపై భారత్ చర్య గురించి చెప్పారు. ఉగ్రవాదులు, డ్రగ్స్, ఆయుధాలను లోయలోకి పంపేందుకు పాక్ ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భద్రతా సంస్థలు కృతనిశ్చయంతో ఉన్నాయని చెప్పారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఇతర భద్రతా సంస్థలతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉంటారని, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.