ఉత్తర సరిహద్దు సురక్షితం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్

By Sumanth KanukulaFirst Published Jan 12, 2023, 3:36 PM IST
Highlights

చైనాతో సరిహద్దు వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. అయితే ఎప్పుడు ఏం  జరుగుతుందో ఊహించలేమని అన్నారు. 

చైనాతో సరిహద్దు వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. అయితే ఎప్పుడు ఏం  జరుగుతుందో ఊహించలేమని అన్నారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన సంఖ్యలో బలగాలను మోహరించినట్టుగా తెలిపారు. ఆర్మీ డేకు ముందు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనరల్ మనోజ్ పాండే మాట్లాడారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి మోహరించిన దళాలు ప్రత్యర్థి నుంచి ఎదురయ్యే దుష్టచర్యలను దృఢంగా తిప్పికొట్టేందుకు అన్ని రకాల సంసిద్దతను కలిగి  ఉన్నారని ఆయన చెప్పారు. 

సరిహద్దులో చైనా చేస్తున్న ప్రతి చర్యను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. ఉత్తర సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు ఎల్‌ఏసీ వెంబడి తగిన సంఖ్యలో బలగాలను మోహరించడం జరిగిందని  తెలిపారు. ఇరుదేశాల సైన్యం.. ఏడు సమస్యలలో ఐదింటిని చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్టుగా చెప్పారు. తాము సైకిక, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని ప్రస్తావిస్తూ.. 2021 ఫిబ్రవరిలో అంగీకరించిన కాల్పుల విరమణ అవగాహన బాగానే ఉందని జనరల్ మనోజ్ పాండే అన్నారు. అయితే ఉగ్రవాదం, ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు సీమాంతర మద్దతు అలాగే కొనసాగుతుందని చెప్పారు. ఆర్టిలరీ యూనిట్లలోకి మహిళా సిబ్బందిని చేర్చుకునే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. 

click me!