
BJP-Arvind Kejriwal-Punjab: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్దూ మూస్ వాలా హత్య నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. పంజాబ్ ఆమ్ ఆద్మీ (ఆప్) సర్కారుపై విమర్శలు గుప్పించింది. ఆప్ అధినేత, ఢల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రిమోట్ కంట్రోల్ ద్వారా పంజాబ్‌ను పరిపాలిస్తున్నారని, పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కారణమని బీజేపీ ఆదివారం ఆరోపించింది. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మూస్ వాలాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం మూస్‌వాలా భద్రతను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఈ హత్య జరిగింది.
సిద్ధూ మూస్ వాలా హత్యపై బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. భద్రతను తొలగించిన వారి పేర్లతో కూడిన రహస్య జాబితాను బహిరంగపరిచారని ఆరోపించారు. "ఒక విధంగా, ఇది హంతకులకు బహిరంగ ఆహ్వానం, మీరు మీ పనిని మీరు చేయగలరు, ఈ హత్యకు అరవింద్ కేజ్రీవాల్ కారణం" అని సంబిత్ పాత్రా అన్నారు. మరో బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా.. సిద్దూ మూస్‌వాలా హత్యపై మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. కేజ్రీవాల్ మరియు రాఘవ్ చద్దా 90 మరియు 45 మంది గన్‌మెన్‌లతో ప్రయాణించారని, అయితే వారు ఒక ప్రముఖ పంజాబీ గాయకుడి భద్రతను తొలగించారని ఆయన అన్నారు. కాగా, మూస్ వాలా గత ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.
పంజాబ్ (punjab) అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో (congress) చేరిన ప్రముఖ పంజాబీ గాయకుడు, రాపర్ సిద్ధూ మూస్ వాలాను (Sidhu Moosewala ) గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. జీపులో వెళ్తుండగా ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలోని వీఐపీలకు పంజాబ్ ప్రభుత్వం (punjab govt) భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.
1993, జూన్ 17న జన్మించిన శుభదీప్ సింగ్ సిద్ధూ, అలియాస్ సిద్ధూ మూసేవాలాకు రాష్ట్రంలో మిలియన్ల మంది అభిమానులు వున్నారు. మాన్సా జిల్లాలోని మూసా అనే గ్రామానికి చెందిన మూస్ వాలా గతేడాది నవంబర్‌లో అభిమానుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాన్సా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఎన్నికల్లో ఆప్‌కి (aap) చెందిన డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో 63,323 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నాజర్ సింగ్ మన్షాహియా.. మూసా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీపై తిరుగుబాటు చేశారు. గత నెలలో సిద్ధూ మూస్ వాలా తన తాజా ఆల్బమ్ ‘‘బలి పశువు’’లో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్ధతుదారులను లక్ష్యంగా చేసుకున్నాడు. అంతేకాదు సదరు పాటలో ఆప్ మద్ధతుదారులను ద్రోహులుగా అభివర్ణించాడు.