
న్యూఢిల్లీ: దేశ విభజన మన దేశ చరిత్రలో ఓ విషాద ఘట్టం. విభజన మారణహోమం దశాబ్దాల పాటు వెంటాడింది. కేవలం భూభాగాన్నే కాదు.. కుటుంబాలను కూడా ఆ నిర్ణయం విభజించింది. అలా విడిపోయిన ఓ అక్కా, తమ్ముడు మళ్లీ 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వీల్ చైర్‌లో కూర్చున్నా.. ఒకరినొకరు కంటనీరు పెట్టుకుంటూ దగ్గరకు తీసుకున్నారు. చుట్టూ ఉన్నవారంతా ఉద్విగ్నతకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఉద్వేగ భరిత కలయికకు కర్తార్‌పూర్ కారిడార్ వేదికైంది.
దేశ విభజన సమయంలో సర్దార్ భజన్ సింగ్ ఇండియా వైపున పంజాబ్‌లో ఉండిపోయాడు. కాగా, అజిజ్ మాత్రం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు మారిపోయాడు. ఇది జరిగి 75 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు 81 ఏళ్ల మహేంద్ర కౌర్ ఇండియాలోనే ఉండగా.. 78 ఏళ్ల ఆమె తమ్ముడు షేక్ అబ్దుల్ అజీజ్ మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాడు.
ఓ సోషల్ మీడియా పోస్టులో వీరు తమ కుటుంబాల గురించి, విభజన సమయంలో తెగిపోయిన బంధం గురించి తలపోసుకున్నారు. వీరి పోస్టులు ఆ రెండు కుటుంబాలు చూశాయి. దీంతో ఆ రెండు పోస్టులు చేసిన వారు ఒకే కుటుంబం అనే నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత కలవాలనే ప్రయత్నం మొదలైంది.
అజిజ్ చిన్న తనంలోనే పెళ్లి చేసుకున్నాడు. కానీ, తన కుటుంబంతో కలవాలని పరితపించేవాడు. మహేంద్ర కౌర్, షేక్ అబ్దుల్ అజీజ్‌లు విడిపోయిన అక్కా తమ్ముళ్లని గుర్తించారు. ఆ విషయం తెలియగానే ఇరు కుటుంబాలు సంతోషంలో తేలిపోయాయి.
Also Read: తన బాయ్ ఫ్రెండ్ పై మొదటిసారిగా స్పందించిన కీర్తి సురేష్.. ‘మిస్టరీ మ్యాన్’ అంటూ ఓపెన్ అయిన కళావతి
ఆ రెండు కుటుంబాలు కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించాయి. ఒకరి చేతిని ఒకరు తీసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పూర్వీకులను యాది చేసుకున్నారు. తమ్ముడి చేతిని చేతిలోకి తీసుకుని అక్క ముద్దాడింది. ఆదివారం వారిద్దరూ కలిసే భోజనం చేశారు.
ఈ కలయికకు గుర్తుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ రీయూనియన్‌ను ప్రశంసించి ఇరు కుటుంబాలను కర్తార్ పూర్ అడ్మినిస్ట్రేషన్ సత్కరించింది. మిఠాయిలు పంచింది.