శ్రద్ధా వాకర్ హత్య కేసు చూసి బ్రేక్ అప్ నిర్ణయం తీసుకున్నా..: పోలీసుల విచారణలో నటి తునీషా శర్మ బాయ్‌ఫ్రెండ్

By Mahesh KFirst Published Dec 26, 2022, 3:29 PM IST
Highlights

ఢిల్లీలో దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసు తర్వాత దేశంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో తాను కలత చెందానని, ఆ పరిస్థితుల వల్లే తాను తునీషా శర్మకు బ్రేక్ అప్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి తునీషా శర్మ బాయ్‌ఫ్రెండ్ పోలీసు విచారణలో తెలిపినట్టు తెలిసింది. 
 

ముంబయి: టీవీ యాక్టర్ తునీషా శర్మ ఆత్మహత్య కలకలం రేపుతున్నది. తునీషా శర్మ బాయ్ ఫ్రెండ్ షీజన్ ఖాన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షీజన్ ఖాన్ బ్రేక్ అప్ చెప్పడంతో తట్టుకోలేక, మానిసకంగా వికలమై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కథనాలు వచ్చాయి. తునీషా శర్మను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విచారణలో షీజన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి.

శ్రద్ధా వాకర్ దారుణ హత్యతో దేశంలో నెలకొన్ని ఆందోళనకర వాతావరణంతో తాను డిస్టర్బ్ అయ్యానని షీజన్ ఖాన్ పోలీసులకు తెలిపారు. అందుకే తునీషా శర్మతో తన రిలేషన్‌షిప్ కట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించినట్టు ఓ పోలీసు అధికారి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వివరించారు. ఇందులో లవ్ జిహాద్ యాంగిల్ కూడా ఉండే అవకాశం ఉన్నదని బీజేపీ నేతలు కొందరు ఇప్పటికే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పోలీసు కస్టడీలో తన తొలి రోజు షీజన్ ఖాన్ వాలివ్ పోలీసులకు తునీషా శర్మతో బ్రేక్ అప్ చేసుకోవడానికి కారణాలను వెల్లడించారు. శ్రద్ధా వాకర్ తర్వాత దేశంలో ఏర్పడ్డ పరిస్థితులను చూసి తునీషా శర్మతో రిలేషన్‌షిప్ ముగించుకున్నా అని తెలిపారు. తామిద్దరమూ వేర్వేరు మతస్తులమని వివరించారు. అలాగే, తమ మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. షీజన్‌కు 28 ఏళ్లు.. తునీషా శర్మకు 20 ఏళ్లు.

Also Read: సీరియల్ నటి తునీషా మృతి కేసు.. సహనటుడు షీజాన్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..!

తునీషా శర్మ సూసైడ్ స్పాట్‌లో సూసైడ్ లెటర్ ఏదీ పోలీసులకు లభించలేదు.

మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ పూనావాలా ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కలిసి ఉన్నారు. ఆ తర్వాత వారు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రద్ధా వాకర్‌ను ఆప్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్ బాడీని 35 భాగాలుగా నరికి రాత్రి 2 గంటల సమయంలో కొన్ని రోజులపాటు ఆ శరీర భాగాలను మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో వేర్వేరు చోట్ల పడేసి వచ్చాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొందరు నేతలు ఇది లవ్ జిహాద్ అని పేర్కొన్నారు. ముస్లింలు హిందూ మహిళలను పెళ్లి చేసుకుని మత మార్పిడికి ఒత్తిడి చేసే కుట్రను లవ్ జిహాద్‌గా కొందరు పేర్కొంటారు. ఈ వాదన నిజమని చెప్పడానికి ఆధారాలు చాలా తక్కువ. తునీషా శర్మ కేసులో ఇలాంటి కోణం ఇప్పటికైతే లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

తునీషా శర్మ అంతకు ముందు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు షీజన్ ఖాన్ తెలిపారు. కానీ, ఆ సమయంలో తాను ఆమెను కాపాడానని వివరించారు. ఈ విషయాన్ని తునీషా శర్మ తల్లికి చెప్పి.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానని షీజన్ ఖాన్ వివరించాడని పోలీసు వర్గాలు వివరించాయి.

Also Read: శ్రద్ధా హత్య కేసులో మరో కీలక పరిణామం.. ఆ ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో స్పష్టత..

కాగా, షీజన్ ఖాన్ తన బిడ్డను చీట్ చేశాడని, యూజ్ చేసుకున్నాడని తునీషా శర్మ ఆరోపణలు చేశారు. షీజన్ ఖాన్‌ను వదిలిపెట్టకూడదని, అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. అతని వల్లే తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

click me!