న్యూఢిల్లీలో కలకలం: ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పై కాల్పులు, ఒకరి మృతి

By narsimha lodeFirst Published Feb 12, 2020, 7:19 AM IST
Highlights

న్యూఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో  ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్  కాన్వాయ్ పై మంగళవారం నాడు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు దిగాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నరేష్ యాదవ్ విజయం సాధించాడు. గుడి నుండి  ఎమ్మెల్యే నరేష్ యాదవ్ వస్తున్న సమయంలో ఓ వ్యక్తి మూడు నుండి నాలుగు రౌండ్ల పాటు ఆయన కాన్యాయ్ పై కాల్పులకు దిగాడు.

నరేష్ యాదవ్ పై ఎవరు కాల్పులకు దిగారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఢిల్లీలోని మెహ్ రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నరేష్ యాదవ్ విజయం సాధించారు. నరేష్ యాదవ్  కాన్వాయ్ పై కాల్పులకు దిగడంతో ఒక వలంటీర్ మృతి చెందాడు. 

also read:వరుస విజయాలు సాధించిన సీఎంలు: హ్యాట్రిక్ వీరులు వీరే

దుండగుడి కాల్పుల నుండి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 63 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
నరేష్ యాదవ్ పై కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగుడు ఎవరనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ స్పందించారు. దాడిని దురదృష్టకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారరు. ఈ దాడి ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నారు. తన కాన్వాయ్ పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా ఎమ్మెల్యే ప్రకటించారు. నిందితుడిని పట్టుకోవాలని ఆయన కోరారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాత్రే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!