పార్కింగ్ ఫీజులు వసూలు చేసే హక్కు షాపింగ్ మాల్స్‌కు లేదు: కేరళ హైకోర్టు

By Mahesh KFirst Published Jan 15, 2022, 1:50 AM IST
Highlights

షాపింగ్ మాల్స్‌కు పార్కింగ్ ఫీజులు వసూలు చేసే హక్కు లేదని కేరళ హైకోర్టు తెలిపింది. భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడే పార్కింగ్ స్పేస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, అది సరిపడా ఉన్న తర్వాతే భవన నిర్మాణానికి అనుమతులు తస్వాయని వివరించింది. అయితే, భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ యజమాని పార్కింగ్ ఫీజు వసూలు చేయడం సాధ్యం కాదని తాను అభిప్రాయపడుతున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్ విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేశారు.
 

తిరువనంతపురం: పార్కింగ్ ఫీజులు(Parking Fees) వసూలు చేసే హక్కు షాపింగ్ మాల్స్‌(Shopping Malls)కు లేవని కేరళ హైకోర్టు(Kerala High Court) సంచలన రూలింగ్ ఇచ్చింది.  ఒక భవన నిర్మాణ అనుమతుల్లోనే పార్కింగ్ ఏరియా అంశం ఉంటుందని, పార్కింగ్ ఏరియా అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత భవన నిర్మాణం జరుగుతుందని తెలిపింది. అయితే, ఆ భవన యజమాని పార్కింగ్ ఫీజు తీసుకోవచ్చా? అనేది ఇక్కడ ప్రశ్న అని, తాను మాత్రం అది సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టు కేరళ హైకోర్టు పీవీ కున్ని క్రిష్ణన్ తెలిపారు. పార్కింగ్ ఫీజు తీసుకోవడానికీ ఎర్నాకుళంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు లైసెన్స్ ఇచ్చారా? అంటూ కలమాసరి మున్సిపాలిటీని ఆదేశించారు. అయితే,  ఆ షాపింగ్ మాల్ ఇకపై పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదనే ఆదేశాలేమీ ఇవ్వలేదు. కానీ, అది వారి రిస్క్‌కు సంబంధించిన విషయం అని వివరించారు.

ఫిలిం డైరెక్టర్ పౌలీ వడక్కన్ కేరళలో ఎర్నాకుళంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు గత నెల 2వ తేదీన వెళ్లాడు. అక్కడ తన కారు పార్కింగ్ కోసం ఫీజు అడిగారని వివరించాడు. తొలుత తాను ఆ ఫీజు ఇవ్వడానికి తిరస్కరిస్తే.. ఆ షాపింగ్ మాల్ స్టాఫ్ ఎగ్జిట్ గేట్లు మూసేశారని తెలిపాడు. తనపై బెదిరింపులకూ పాల్పడ్డారని పేర్కొన్నాడు. తన నుంచి రూ. 20 పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేసుకున్నారని వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు.

ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ ఏరియా పబ్లిక్ ప్లేస్‌గా ఉంటుందని, ఆ కమర్షియల్ కాంప్లెక్స్‌కు వచ్చిన వారి కోసం ఆ స్పేస్ ఉంటుందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అందుకే తన నుంచి లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కూడా పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేయరాదని వివరించాడు. అయితే, ఈ వాదనను లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ తరఫు న్యాయవాది తప్పుపట్టారు. తమ షాపింగ మాల్‌కు అందుకోసం లైసెన్స్ ఉన్నదని తెలిపాడు.

బిల్డింగ్ రూల్స్ ప్రకారం, ఒక భవనాన్ని నిర్మించడానికి దానికి తగినంత పార్కింగ్ స్పేస్ ఉండటం తప్పనిసరి అని న్యాయమూర్తి అన్నారు. పార్కింగ్ స్పేస్ ఆ భవనంలో అంతర్భాగమని చెప్పారు. బిల్డింగ్‌లో సరిపడా పార్కింగ్ స్పేస్ ఉంటుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దాని నిర్మాణానికి అనుమతులు ఇస్తారని వివరించారు. దీని ఆధారంగానే భవన నిర్మాణం జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ భవన యజమాని పార్కింగ్ ఫీజు వసూలు చేయవచ్చా అనేది అసలైన ప్రశ్న అని అన్నారు. అయితే, అది సాధ్యపడదనేది తన ప్రాథమిక అభిప్రాయం అని వివరించారు.

లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి పర్మిషన్ ఇచ్చారా? అని మున్సిపాలిటీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ అంశంపై మున్సిపాలిటీ తన వైఖరిని వెల్లడించాలని పిటిషన్ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. అయితే, వారు వారి రిస్క్‌పై పార్కింగ్ ఫీజు వసూలు చేయవచ్చని స్పష్టం చేశారు.

click me!