టీకా తీసుకున్నాక నయమైన పక్షవాతం.. ‘మిరాకిల్.. వైద్య నిపుణులు రీసెర్చ్ చేయాలి’

By Mahesh KFirst Published Jan 15, 2022, 1:06 AM IST
Highlights

జార్ఖండ్‌లోని 55 ఏళ్ల దులర్‌చంద్ ముండా ఈ నెల 4వ తేదీన కొవిషీల్డ్ టీకా వేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్‌లో ఆయన బాడీ చచ్చుబడిపోయింది. గొంతు కూడా రావడం లేదు. కానీ, ఈ టీకా వేసుకున్న తర్వాత తన సొంతకాళ్లపై నిలబడటమే కాదు.. నడవగలుగుతున్నాడు. మాట్లాడగలుతున్నాడు. ఈ పరిణామంపై వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసును సైంటిస్టులు పరిశోధన చేసి వివరాలు వెల్లడించాల్సిందేనని తెలిపారు. కాగా, ఇది ఒక మిరాకిల్ అని ఆ గ్రామ టీచర్ పేర్కొన్నాడు.
 

రాంచీ: టీకా వ్యాక్సినేషన్‌(Vaccination) భారత్‌లో శరవేగంగా సాగుతున్నది. రెండు డోసులే కాదు.. మూడో డోసు వేయడమూ ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ తొలినాళ్లలో టీకా వేసుకోవడంపై అనేక భయాలు ప్రజల్లో కలిగాయి. వాటికితోడు అనేక అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. టీకా వేసుకుంటే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టుతాయనే వదంతులు మొదలు అనేక ఊహాగానాలు ఈ భయాలకు తోడుగా ప్రచారమయ్యాయి. కానీ, అవగాహన కార్యక్రమాల ద్వారా చాలా వరకు ఈ సంశయాలను అధికారులు తొలగించగలిగారు. అయితే, ఈ పరిస్థితులకు భిన్నమైన ఉదంతాలు ఇప్పుడు ఎదురువస్తున్నాయి. ఓ బిహార్ వ్యక్తి 11 డోసులు తీసుకున్నట్టు వచ్చిన వార్తలు సంచలనం అయ్యాయి. ఈ టీకా డోసులతో తనలోని కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తున్నదని ఆయన వాదించారు. తాజాగా, అలాంటి కేసు వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్‌(Jharkhand)లోని ఓ 55 ఏళ్ల వృద్ధుడు కొవిషీల్డ్ టీకా(Covishield Vaccine) వేసుకున్నాడు. ఈ నెల 4వ తేదీన ఆయన టీకా వేసుకోగా.. తర్వాతి రోజే తన పక్షవాతం (Paralysis) నయమైందని వెల్లడించాడు. ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురైనట్టు చెప్పాడు. కానీ, టీకా తీసుకున్న తర్వాత తాను ఇప్పుడు లేచి నిలబడటమే కాదు.. నడుస్తున్నానని సంబురపడ్డాడు. మాటలు కూడా గతంలో కంటే స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానని చెప్పాడు. ఈ పరిణామంతో వైద్య అధికారులూ షాక్‌కు గురవుతున్నారు. ఇలా జరగడం దాదాపు అసాధ్యమని అంటున్నారు. కొందరైతే.. ఇది మిరాకిల్ అని చెబుతున్నారు.

జార్ఖండ్‌ బొకారో జిల్లాలోని సాల్గడి గ్రామానికి చెందిన దులర్‌చంద్ ముండా కుటుంబం నాలుగేళ్ల క్రితం యాక్సిడెంట్‌‌కు గురైంది. అప్పటి నుంచి దులర్‌చంద్ ముండా తన గొంతు కోల్పోయాడు. తన దేహం చలించకుండా మారిపోయింది. పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి సుమారు రూ. 4 లక్షల విలువైన చికిత్స అందిస్తూనే ఉన్నారు. కానీ, ఎలాంటి ఫలితాలు రాలేవు. ఆయన కుంటుంబం ఈ నెల 4వ తేదీన కొవిషీల్డ్ టీకా వేసుకుంది. ఆయన కూడా వారితోపాటే టీకా వేసుకున్నాడు. టీకా తర్వాత ఆయన బాడీలో గణనీయమైన మార్పులు వచ్చాయని వివరించాడు. తర్వాతి రోజు నుంచే తాను తన కాళ్లపై నిలబడగలిగాడని తెలిపాడు. ఆ తర్వాత మెల్లగా నడుస్తున్నానని చెప్పాడు. ఈ మార్పుపై ఆరోగ్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉన్నదని, కానీ, ఇలా ఎందుకు జరిగిందనేది సైంటిస్టులు తేల్చాలని బొకారో సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ తెలిపాడు. కొన్ని రోజుల కిందటి సమస్య అయితే.. కోలుకున్నాడంటే నమ్మగలం కానీ, దీర్ఘకాలంగా అంటే నాలుగేళ్ల క్రితం సమస్య నుంచి ఇంత త్వరగా కేవలం టీకా ద్వారా కోలుకున్నాడంటే నమ్మలేకున్నామని వివరించాడు. పరిశీలించడానికి ఓ మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. దులర్‌చంద్ ముండా అనారోగ్య స్థితిపై, ఆయన రికవరీపై శాస్త్ర నిపుణులు పరిశోధనలు జరిపిన తర్వాతే కచ్చితమైన వివరాలు తెలియవస్తాయని పెటర్వార్ హెల్త్ సెంటర్ బాధ్యులు అల్బల్ కెర్కట్టా వివరించారు. ఇది మిరాకిల్ అని ఆ గ్రామ టీచర్ పేర్కొన్నాడు. కేవలం టీకా వేసుకుంటే ఇలా జరుగుతుందని తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు.

click me!