లిక్కర్‌ను ఎక్కువ ధరలకు అమ్మడం ఇక అసాధ్యం.. ఇక్కడ ప్రభుత్వ బిల్లులు తప్పనిసరి

By telugu teamFirst Published Aug 20, 2021, 8:09 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌ మందుబాబులకు శుభవార్త తెలిపింది. షాపులు మద్యం ధరలను పెంచి అమ్మకుండా నియంత్రించే ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించింది. వచ్చే నెల నుంచి ప్రతి లిక్కర్ షాపు కస్టమర్లకు బిల్లు చిట్టీలను అందించాల్సి ఉంటుంది. నకిలీ బిల్లులను అరికట్టడానికి ప్రభుత్వం అందించే బిల్లు చిట్టీలనే వినియోగించాలని ఆదేశించింది.

భోపాల్: మనదేశంలో లిక్కర్‌ను దానిపై ఉన్న గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మడం సర్వసాధారణం. వ్యాపారులు ఒక్కోసారి ఊహించనంతగా పెంచేస్తారు. రూ. 10 నుంచి రూ. 20 పెంచి అమ్మేస్తుంటారు. దానికి కనీసం ఒక కారణమూ ఉండదు. బెల్ట్ షాపుల్లో పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంటుంది. ఫలితంగా మద్యం కొనుగోలూ ఖరీదైన అంశంగా మారింది. వాస్తవ ధర కంటే అధికంగా వ్యాపారుల బాదుడు అదనపు భారమవుతుంది. ఇలా జేబుకు చిల్లులు పెట్టుకుంటున్న ‘ట్యాక్స్‌పేయర్ల’ కోసం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒక ఉపాయం ఆలోచించింది. అక్కడ లిక్కర్‌పై పేర్కొన్న ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మకుండా నియంత్రించడానికి ఒక మెకానిజాన్ని ప్రిపేర్ చేసింది.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 3,300కు మించి లిక్కర్ షాపులున్నాయి. ఇవన్నీ దేశీ మందు లేదా ఇంగ్లీష్ లిక్కర్‌ అయినా అమ్మితే అందుకు బిల్లులను తప్పనిసరిగా కస్టమర్లకు అందించాలి. రశీదులను కస్టమర్లకు అందించని షాపులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లుల పుస్తకాలను ప్రభుత్వం నుంచే తీసుకోవాలని, వాటినే వినియోగించాలని నిబంధన పెట్టింది. ప్రభుత్వం సర్టిఫై చేసిన బిల్లు బుక్కుల్లో కార్బన్ కాపీ పెట్టి ప్రతి విక్రయానికి బిల్లులు నమోదు చేయాలని తెలిపింది. ఒరిజినల్ రశీదు కస్టమర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, కార్బన్ కాపీ బిల్లులన్నింటినీ ప్రతి ఏడాది మార్చి 31దాకా భద్రపరచుకోవాలని ఆదేశించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

ఈ నిర్ణయాన్ని మందుబాబులు స్వాగతిస్తున్నారు. ఈ నిబంధనతో బెల్టు షాపుల దోపిడీకి తెరపడుతుందంటున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధర అమలు కావడానికి సాధ్యపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు, అన్ని మద్యం దుకాణాల దగ్గర సీసీటీవీలు తప్పనిసరిగా పెట్టాలనే నిబంధననూ పొందుపరచాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని లిక్కర్ షాపులన్నీ కస్టమర్లందరికీ బిల్లులు అందివ్వాలని, దీనితోపాటు ఆయా ఏరియాల్లోని ఎక్సైజ్ శాఖ అధికారి ఫోన్ నెంబర్లు షాపుపై రాయాలని మధ్యప్రదేశ్ ఎక్సైజు కమిషనర్ రాజీవ్ దూబే తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే కస్టమర్లు అబ్కారీ అధికారికి సమాచారం చేరవేయడం ఈ నెంబర్ ద్వారా వీలవుతుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో మద్యం అక్రమ అమ్మకాలకు ఫుల్ స్టాప్ పడుతుందని తెలిపారు.

మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మడం అన్ని రాష్ట్రాల్లో కనిపించేదే. అంతేకాదు, నకిలీ మద్యాన్ని అమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకొల్లలు. అందుకే, ఇలాంటి అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వాలు పూనుకోవడం శుభపరిణామమని లిక్కర్ బాబులు చెబుతున్నారు.

click me!