2024 టార్గెట్: 19 పార్టీల నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా భేటీ

By telugu teamFirst Published Aug 20, 2021, 7:26 PM IST
Highlights

వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా నిలవాలని, దేశానికి ప్రజాహిత ప్రభుత్వాన్ని అందించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ప్రతిపక్షాల ఐక్య కార్యచరణ కోసం సమాయత్తమవుతున్న తరుణంలో ఆమె మొత్తం 19 పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరో 18 ప్రతిపక్ష పార్టీల నేతలతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. తొలిసారిగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని, 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 జనరల్ ఎలక్షన్స్‌ గురించి విపక్షాలన్నీ సంయుక్త కార్యచరణ కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

రాజ్యాంగ నియమాలకు కట్టుబడి, విలువలను పాటించే, స్వాతంత్ర్య ఉద్యమంపై గౌరవించే, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉండే ప్రభుత్వాన్ని దేశానికి అందించాల్సి ఉన్నదని, అందుకోసం ప్రతిపక్షాలన్నీ ఒక పద్ధతి ప్రకారం సమాయత్తమవ్వాలని సోనియా గాంధీ అన్నారు. సమావేశం ప్రారంభంలోనే కేంద్రంపై విమర్శలు కురిపించారు. ప్రజా ప్రయోజనాల అంశాలు, అత్యవసరంగా చర్చ జరపాల్సిన విషయాలను కేంద్రం దాటవేసిందని ఆరోపించారు. అహంకారపూరితంగా కేంద్రం ప్రజా ప్రయోజనాలపై చర్చను తిరస్కరించిందని విమర్శలు చేశారు.
ఈ సమావేశాల్లో విపక్షాల ఐక్యత కనిపించిందని, కనీసం 20 రోజులు సంయుక్తంగా ప్రదర్శనలు చేశాయని వివరించారు. పార్లమెంటులో సమన్వయంతో కలిసి పని చేశాయని, ఇదే ఐక్యత పార్లమెంటు బయటా ఉండాలని తెలిపారు. విపక్షాల వల్లే ఓబీసీ బిల్లు సవరణ సాధ్యమైందని, తద్వారా ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం కలిగిందని సోనియా గాంధీ అన్నారు.

ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రరే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లు పాల్గొన్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ సహా 19 ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో చర్చించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరిలు పాల్గొన్నారు. ఈ భేటీలో సమాజ్‌వాదీ పార్టీ పాల్గొనకపోవడం గమనార్హం. బీఎస్పీ, ఆప్‌లు మొదటి నుంచే ఈ కూటమి నుంచి డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాయి.

click me!