టెకీ భానురేఖ మృతిపై.. బెంగళూరు మహానగర పాలక సంస్థ షాకింగ్ రిపోర్టు..

By SumaBala BukkaFirst Published May 23, 2023, 3:26 PM IST
Highlights

బెంగళూరులో టెకీ భానురేఖ మృతికి కారణం ఆమె స్వీయతప్పిదమే అని బీబీఎంపీ రిపోర్ట్ ఇచ్చింది. దీనిమీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన భానురేఖ (23) అనే టెకీ మృతి చెందిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అండర్పాస్ వరదలో చిక్కుకొని ఆ యువతి మృత్యువాత పడింది. దీనిమీద రాజకీయంగాను తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. మృతురాలి కుటుంబానికి పరిహారం ప్రకటించింది. ఈ ఘటన మీద దర్యాప్తుకు ఆదేశించింది.  

అయితే, ఇప్పుడు ఈ దర్యాప్తులో వెలువడిన విషయాలు.. బెంగళూరు మహానగర పాలక సంస్థ ఇంటర్నల్ రిపోర్టులో  పొందుపరిచిన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ.. ఆమె మరణానికి స్వీయ తప్పిదమే కారణమని నివేదికను తయారు చేసింది. వారు వెడుతున్న సమయంలో కేఆర్ సర్కిల్ అండర్ పాస్ కింద నీరు చేరి ఉంది. అక్కడ బారికేడ్లు కూడా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు.  

బెంగళూరు వర్షాలు : మహిళ చీర ఐదుగురి ప్రాణాలు కాపాడింది..

ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది అటువైపు వెళ్లొద్దంటూ కేకలు వేశారు. వారించే ప్రయత్నం చేశారు. కానీ వాటిని డ్రైవర్ పట్టించుకోలేదు. ఈ సమయంలో డ్రైవర్ను అలా వెళ్లొద్దని అడ్డుకునే అవకాశం ఉన్నా కూడా భానురేఖ ఆ పని చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది’ అని బిబిఎంపి నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. ఆమె మృతికి బీబీఎంపీ నిర్లక్ష్యం ఏమాత్రం కారణం కాదని..  తమ పౌర సేవల విభాగం ఏ మాత్రం దీనికి బాధ్యత వహించదని బిబిఎంపీ పేర్కొంటుంది.

దీంతో పాటు ఘటన జరిగిన రోజు భారీ వర్షం కురిసింది. తీవ్రమైన ఈదురు గాలుల ధాటికి చెట్ల కొమ్మలు, ఎండుటాకులు నేలరాలాయి.  అవి వర్షపు నీటితో కలిసి కేఆర్ అండర్పాస్ వద్ద నీరు నిలిచిపోవడానికి కారణం అయ్యాయి. అండర్ పాసుల కింద వాన నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీలను నిర్మించాల్సిన అవసరం ఉందని కూడా బీబీఎంపీ నివేదికలో అభిప్రాయపడింది. అయితే, కేఆర్ సర్కిల్ అండర్ పాస్ దగ్గర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. కాకపోతే భారీ వర్షం కారణంగా.. దానికి కెపాసిటీకి మించిన నీరు చేరింది. 

దీనికి తోడు  ఈదురు గాలులకు నేలరాలిన ఆకులు, చెట్ల కొమ్మలు డ్రైనేజీకి అడ్డుపడడంతో నీరు పెద్ద మొత్తంలో నిలిచిపోయిందని తన నివేదికలో మహానగర పాలక సంస్థ తెలిపింది. ఈ రిపోర్టుకు సంబంధించిన ఒక కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నెటిజెన్లు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. భాను రేఖ చనిపోవడానికి అసలు కారణం బీబీఎంపీనే  కారణమన్నారు.  ఇంకోవైపు ఈ ఘటన మీద భాను రేఖ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

బీబీఎంపీ నిర్లక్ష్యంతో పాటు డ్రైవర్ హరీష్ గౌడ.. నిర్లక్ష్య ధోరణి కూడా తమ బిడ్డ మృతికి కారణమంటూ కలసూరు గేటు పిఎస్ లో వారు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. బెంగళూరులో అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాల కోల్పోయిన భానురేఖ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని  తేలప్రోలుకు తరలించి నేడు అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

click me!