బీజేపీకి షాక్.. యూపీ, గోవా ఎన్నికల్లో పోటీకి శివసేన సై

By Siva KodatiFirst Published Sep 12, 2021, 3:38 PM IST
Highlights

రానున్న ఉత్తర్ ప్రదేశ్, గోవా ఎన్నికల్లో తమ పార్టీ వీలైనన్ని సీట్లలో పోటీ చేస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. 400 పైచిలుకు స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో 80 నియోజక వర్గాల్లో శివసేన పోటీలో ఉంటుందని ఆయన అన్నారు. ఇక గోవాలో మొత్తం 40 సీట్లుండగా 20 మంది వరకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని రౌత్ పేర్కొన్నారు.

త్వరలో జరగనున్న యూపీ, గోవా ఎన్నికల్లో పోటీకి బీజేపీ ఒకప్పటి మిత్రపక్షం శివసేన  కూడా సిద్ధం అవుతున్నట్లుగా  తెలుస్తోంది. ఈ మేరకు శివసేన వచ్చే సంవత్సరం కీలక ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టింది. 2022లో యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రం, గోవా లాంటి చిన్న రాష్ట్రం రెండూ ఎలక్షన్స్ ముంగిట నిలవనున్నాయి. రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే వున్నాయి. అయితే  ఎలాగైనా మోడీ, అమిత్ షా జోరుకి కళ్లెం వేయాలని చూస్తోన్న శివసేన సదరు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో తమ అభ్యర్థుల్ని నిలపాలని భావిస్తోందట. ఈ విషయంపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఉత్తర్ ప్రదేశ్, గోవా ఎన్నికల్లో తమ పార్టీ వీలైనన్ని సీట్లలో పోటీ చేస్తుందని సంజయ్ వెల్లడించారు. 400 పైచిలుకు స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో 80 నియోజక వర్గాల్లో శివసేన పోటీలో ఉంటుందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలోని రైతులు తమకు మద్దతు ఇచ్చేందుకు సుముఖత చూపారని సంజయ్ స్పష్టం చేశారు. ఇక గోవాలో మొత్తం 40 సీట్లుండగా 20 మంది వరకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని రౌత్ పేర్కొన్నారు. గోవాలో మహారాష్ట్రలోని ‘మహా వికాస్ అగాడి‘ మాదిరిగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని ఆయన తెలిపారు. 

గోవాలో, మహారాష్ట్రలో శివసేన కూడా కమలదళానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగితే బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శివసేన ఇమేజ్ కూడా హిందూత్వపైనే ఆధారపడటంతో బీజేపీ ఓట్లు కొన్ని అటుగా చీలే అవకాశం లేకపోలేదు. మరి, శివసేన వ్యవహారంపై బీజేపీ నుంచీ ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 
 

click me!