
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి పార్టీ గుర్తు ఎంపికలను సమర్పించింది. సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సిన మూడు ఎన్నికల గుర్తులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ గుర్తులను ఎంపిక చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం.. బాకా, కత్తి లను తమ ఎన్నికల గుర్తులుగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు షిండే వర్గం ఎన్నికల సంఘం (ఈసీ)కి తమ చిహ్నాల జాబితాను సోమవారం సమర్పించింది. ఇందులో బాకా, కత్తి చిహ్నాల్లో ఒకదానిని తమ వర్గం చిహ్నంగా పరిగణించాలని ఈసీని కోరింది.
శివసేన పేరు, గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం
అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక ఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం తమ వర్గాన్ని శివసేనగా ప్రకటించాలని, 'విల్లు మరియు బాణం' గుర్తును కూడా కేటాయించాలని ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో షిండే వర్గం 19 మంది ఎంపీల్లో 12 మంది, 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది, 11 మంది రాష్ట్రాధినేతలు, 144 మంది ఆఫీస్ బేరర్లు, 1,51,483 మంది ప్రాథమిక సభ్యులతో అఫిడవిట్‌లు సమర్పించారు. నవంబర్ 3న అంధేరి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా, పిటిషన్‌ను వెంటనే పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
అయితే, ఉప ఎన్నికల ముసుగులో షిండే శిబిరం హడావుడి చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపించింది. 4 వారాల్లో 10 లక్షలకు పైగా ప్రాథమిక సభ్యుల అఫిడవిట్‌లను ఎన్నికల సంఘంలో సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉప ఎన్నికల్లో ఎలాంటి గందరగోళం, వైరుధ్యాలు తలెత్తకుండా చూసేందుకు ఎన్నికల సంఘం పార్టీ పేరు, గుర్తును స్తంభింపజేయాలని నిర్ణయించింది.
దీంతో అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నంతోపాటు పార్టీ పేర్లను సమర్పించాలని శివసేన రెండు వర్గాలకు సూచించింది. సోమవారం వరకు పార్టీ పేర్లను. గుర్తును ఎంపిక చేసుకోమని ఆదేశించింది.
కాగా, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఆదివారం నాడే ఎన్నిక కమిషన్ కు సమర్పించింది. మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లను ప్రస్తావించింది. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, కాగడా లను గుర్తులుగా ఎంపిక చేయగా.. శివసేన (బాలాసాహెబ్ ఠాక్రే), శివసేన (ప్రబోధంకర్ ఠాక్రే), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లను పార్టీ పేర్లుగా ఎంపిక చేసి పేర్కొంది. జాబితాలోని మూడు గుర్తుల్లో ఏ గుర్తు ఇచ్చినా, మూడు పార్టీ పేర్లలో ఏ పేరు ఖరారు చేసినా తమకు సమ్మతమేనని ఉద్ధవ్ ఠాక్రే వర్గం పేర్కొంది.