మా పార్టీని ఓడించండి.. బీజేపీ ఎంపీ

By ramya neerukondaFirst Published Oct 15, 2018, 4:40 PM IST
Highlights

 ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఏకమై బీజేపీని ఓడించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ ఓడిపోవాలని బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా కోరుకుంటున్నారు.  ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న ఆయన.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని రఫేల్ వివాదంపై మాట్లాడి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

‘భారత ప్రభుత్వ ఇష్ట ప్రకారమే రిలయన్స్‌ను డసో.. తమ స్థానిక భాగస్వామిగా ఎంచుకుందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ చెప్పినట్లు ఆ దేశ మీడియా ఇటీవల పేర్కొంది. యుద్ధ విమానాలను తయారు చేయడంలో చాలా అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వంటి దేశీయ సంస్థను పక్కకు పెట్టి, డిఫెన్స్‌లో కొత్తదైన సంస్థను ఇందులో ఎందుకు భాగస్వామిని చేశారు?’ అని ఆయన ప్రశ్నించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ని ఓడించాలని శత్రుఘ్న సిన్హా ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఏకమై బీజేపీని ఓడించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీపై  ఆయన తరుచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా కూడా ఈ వివాదంపై ఆరోపణలు చేశారు. 

కాగా, ఈ ఒప్పందంలో హెచ్‌ఏఎల్‌ను భాగస్వామి చేసుకోకపోవడంతో రఫేల్ యద్ధ విమానాల సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోయామని, వేలాది మంది భారత టెక్నీషియన్లకు ఉద్యోగాలు రాకుండా పోయాయని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ఈ ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై విచారణ జరిపించాలని ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

click me!