పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికల వేడి.. టీఎంసీ నుంచి బరిలోకి శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో

Published : Mar 13, 2022, 02:11 PM IST
పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికల వేడి.. టీఎంసీ నుంచి బరిలోకి శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికల వేడి రగులుకుంటున్నది. ఈ రాష్ట్రంలో ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు స్థానానికి శత్రుఘ్న సిన్హా, అసెంబ్లీ స్థానానికి బాబుల్ సుప్రియో పోటీ చేయనున్నట్టు మమతా బెనర్జీ వెల్లడించారు.  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ఈ రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒక యుద్ధమే జరిగింది. ఎట్టకేలకు దేశ ప్రజలంతా ఉత్కంఠగా చూసిన ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కాక రేగుతున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఒక పార్లమెంటు స్థానానికి, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది.

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. అసన్సోల్ పార్లమెంటు నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికలో టీఎంసీ తరఫున కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా బరిలోకి దిగుతాడని ట్వీట్ చేశారు. కాగా, బ్యాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న బైపోల్‌లో తమ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో అని వెల్లడించారు. జై హింద్.. జై బంగ్లా.. జై మా, మాటి, మనుష్ అని ట్వీట్ చేశారు.

బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో అసన్సోల్ పార్లమెంటరీ స్థానంలో ఖాళీ ఏర్పడింది. కాగా, బ్యాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రతా ముఖర్జీ గతేడాది నవంబర్ 4వ తేదీన మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అనారోగ్యానికి గురైన సుబ్రతా ముఖర్జీ ప్రభుత్వ హాస్పిటల్ ఎస్ఎస్‌కేఎంలో చికిత్స పొందుతూ మరణించారు. మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఆయన కీలక మంత్రిగా కొనసాగారు.

ఎన్నికల సంఘం తాజాగా, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అయింది. ఈ మేరకు 12వ తేదీన ఓ ప్రకటనలో వెల్లడించింది. బిహార్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లలో ఖాళీగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. కౌంటింగ్ 16వ తేదీన ఉంటుందని తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంటరీ స్థానానికి, బ్యాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనుంది. వీటితోపాటు ఛత్తీస్‌గడ్‌లోని ఖైరాగడ్ అసెంబ్లీ స్థానానికి, బిహార్‌లోని బొచహాన్ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని ఉత్తర కొల్హపూర్ స్థానానికి ఎన్నికల సంఘం బైపోల్ నిర్వహించనుంది. ఈ ఎన్నికల కోసం మార్చి 17వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా, ఈ ఉప ఎన్నికలకు నామినేషన్ సమర్పించడానికి చివరి తేదీగా ఈ నెల 24వ తేదీని నిర్ధారించింది. నామినేషన్‌ల పరిశీలన 25వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణ 28వ తేదీ అని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, పైన పేర్కొన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఏప్రిల్ 12వ తేదీన జరుగుతాయని వెల్లడించింది. కాగా, కౌంటింగ్ 16వ తేదీన ఉంటుందని వివరించింది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu