
Hijab Row: ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తలకు కారణమైన అంశాల్లో హిజాబ్ వివాదం ఒకటి. కర్నాకలోని ఉడిపి జిల్లాలో రాజుకున్న ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణమైంది. ఇరర రాష్ట్రాలకు సైతం పాకింది. అయితే, న్యాయస్థానాల జోక్యంతో ఈ విషయం సద్దుమణిగింది. కానీ తాజాగా మళ్లీ హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ సారి ఉత్తరప్రదేశ్ లో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకెళ్తే.. అలీఘర్‌లోని ఒక ప్రముఖ కళాశాల శనివారం నాడు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. అందులో క్యాంపస్‌లోకి సూచించబడిన యూనిఫాం లేకుండా విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొంది. హిజాబ్ ధరించి ఉన్న ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించింది. క్లాస్‌కు హాజరవుతున్నప్పుడు ముఖాన్ని కప్పుకోవద్దని, హిజాబ్ ధరించవద్దని అలీఘర్ లోని శ్రీ వర్షిణీ కాలేజీ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి హిజాబ్ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. హిజాబ్ ధరించిన విద్యార్థులకు ప్రవేశం నిరాకరించడంతో పలువురు విద్యార్థులు ఇంటికి చేరుకున్నారు. సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని మీడియాతో అన్నారు.
ఆ కాలేజీలో BA మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ఇప్పుడు, నేను ఇంటికి తిరిగి వస్తున్నాను. ఎందుకంటే హిజాబ్ ధరించిన వారిని కాలేజీ క్యాంపస్ లోకి అనుమతించడం లేదు అని తెలిపింది. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మరో విద్యార్థిని మాట్లాడుతూ.. క్యాంపస్‌లోకి ప్రవేశించే సమయంలో తాను ధరించిన బురఖాను తొలగించాలని కళాశాల అధికారులు మొదట అడిగారని, ఆ తర్వాత హిజాబ్‌ను కూడా తొలగించాలని కోరారు. "నేను గౌరవప్రదంగా కళాశాలలో ప్రవేశించాను. మా హిజాబ్‌తో వారికి ఎందుకు సమస్య ఉందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను” అని ఆ విద్యార్థిని చెప్పింది. "నేను హిజాబ్ లేకుండా ఎక్కడికీ వెళ్ళడానికి సిద్ధంగా లేను మరియు కళాశాల మమ్మల్ని ఇకపై క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించదు" అని పేర్కొన్నారు.
కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీనా ఉపాధ్యాయ మాట్లాడుతూ.. కళాశాలలో డ్రెస్ కోడ్ ఉందనీ, అందరు విద్యార్థులు దీనిని పాటించాలని పేర్కొన్నారు. ఈ డ్రెస్ కోడ్ ను గుర్తు చేస్తూ..మరోసారి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. college proctor Anil Varshney మాట్లాడుతూ.. " ప్రాస్పెక్టస్‌లో డ్రెస్ కోడ్ స్పష్టంగా పేర్కొనబడింది. విద్యార్థులు కళాశాల నియమాలు మరియు నిబంధనలను మాత్రమే పాటించాలని మేము కోరుకుంటున్నాము" అని అన్నారు. ఇంత అకస్మాత్తుగా ఆర్డర్ ఎందుకు వచ్చిందని అడిగితే, పేరు చెప్పడానికి ఇష్టపడని కళాశాలలోని ఒక సీనియర్ అధికారి.. “మేము ఆదేశాలను అనుసరిస్తున్నాము. ఇప్పుడు మరింత సీరియస్‌గా డ్రెస్‌కోడ్‌లను అమలు చేస్తామని విద్యార్థులకు ఇప్పుడే చెప్పబడింది" అని అన్నారు.
దీనిపై డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. "అవును, అదే (హిజాబ్ ధరించకూడదని) మాకు చెప్పబడింది. విచిత్రం ఏంటంటే నేనెప్పుడూ హిజాబ్ వేసుకుని కాలేజీకి వచ్చేదానిని. నా మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం దానితో ఎవరికీ సమస్య లేదు. ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వస్తుందో" అని అన్నారు.