
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తాను కూడా పాల్గొంటానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. సమాజంలో సామరస్యాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించినప్పుడు అందులో తాను పాల్గొంటానని వెల్లడించారు. ఆదివారం శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ తనను కలిశారని.. నవంబర్ 7న భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించిన తర్వాత యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందజేశారని చెప్పారు.
‘‘ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. కానీ ఈ చొరవ ద్వారా సమాజంలో సామరస్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి మేము, వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు సాధ్యమైన చోట చేరుతాం’’ అని పవర్ పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం నింపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ పాదయాత్ర పూర్తైంది. ఈ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. 150 రోజుల్లో దాదాపు 3,570 కి.మీ మేర సాగనుంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎన్నికలపై స్పందించిన శరద్ పవార్.. ‘‘రాజకీయాలను కొన్ని రంగాల్లోకి తీసుకురాకూడదు. అది చేసేవారు అవగాహన లేని వ్యక్తులు. నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రతినిధిగా నరేంద్ర మోడీ (ప్రస్తుత ప్రధాని), అరుణ్ జైట్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించగా, అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పించడం మన పని. ఇతర సమస్యల గురించి మేం బాధపడం’’ అని అన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఔరంగాబాద్ జిల్లాలో పర్యటనపై కూడా శరద్ పవార్ స్పందించారు. ‘‘రైతులను కలిసేందుకు ఆయన పర్యటించడం చాలా బాగుంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడింది ... సందేహాలు ఎందుకు?. ఆయన రైతుల డిమాండ్లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ముందు ఉంచాలి. రైతులకు మేలు జరిగితే మంచిదే కదా’’ అని అన్నారు.
ఇక, ఈ ఏడాది జూన్‌లో శివసేన నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో.. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు.