
భారత దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నా.. వారిలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్ల దొరల బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విడిపించేందుకు వీరు చేసిన త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. మదమెక్కిన బ్రిటిషర్లకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను ఈ దేశానికి అంకితం ఇచ్చారు. సరిగ్గా 91 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆ ముగ్గురు దేశం కోసం తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగానికి గుర్తుగా నేడు దేశం మొత్తం ‘షాహీద్ దివాస్’ ను జరుపుకుంటోంది.
అది 1931 మార్చి 23వ తేదీ. బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్తాన్)లోని లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటీషర్లు ముగ్గురిని ఉరితీశారు. లాహోర్ కుట్ర కేసులో వీర దేశభక్తులకు మరణశిక్ష విధించారు. వారు ఎవరో కాదు తమ పోరాటాలతో బ్రిటిషర్లకు కంటి మీద కునుకులేకుండా చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు. నిజానికి వారిని మార్చి 24, 1931న ఉరితీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఎప్పుడు ఎటు నుంచి ఏ ఉప ద్రవం ముంచుకొస్తుందో తెలియక ఉరి వేసుందుకు నిర్ణీత సమయానికి దాదాపు 11 గంటల ముందు మార్చి 23, 1931 రాత్రి 7:30 గంటలకు ఆ వీరులను ఉరి తీశారు.
1928 సంవత్సరం నవంబర్ నెలలో భారత దేశ స్వాతంత్ర సమరంలో అత్యంత ప్రముఖుల్లో ఒకరైన లాలా లజపత్ రాయ్ మరణించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా చేసిన అహింసాయుత ఆందోళనకు రాయ్ నాయకత్వం వహించారు. దీంతో పాటు ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, భారత స్వాతంత్రం కోసం పోరాడేందుకు అనేక మంది యువకులను తయారు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు అనేక మందిని ప్రేరేపించారు. అతిక్రూరుడైన బ్రిటీష్ పోలీసు అధికారి జేమ్స్ ఎ స్కాట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాణాంతక లాఠీ ఛార్జ్ లో రాయ్ కు గాయాలు అయ్యాయి. ఈ గాయాలతోనే ఆయన చనిపోయారు. దీంతో ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ప్రతిజ్ఞ చేశారు.
బ్రిటిష్ దళాలకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతో సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు బ్రిటీష్ పోలీసు అధికారి జేమ్స్ ఎ స్కాట్ ను ఉరితీయాలని ప్లాన్ చేశారు. ఓ సందర్భంలో స్కాట్‌ను ఉరితీయాలని భగత్ సింగ్ బహిరంగంగా కూడా ప్రకటించాడు. అయితే ఈ ముగ్గురు వీరులు వేరే బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్‌ను స్కాట్ గా పొరపడి అతడిని కాల్చి చంపారు. దీంతో బ్రిటిష్ వారు సాండర్స్ హత్యకు వీరే కారణం అంటూ ఈ ముగ్గురు స్వాతంత్ర సమరయోధులపై అభియోగాలు మోపారు. అయినప్పటికీ భగత్ సింగ్ తన స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు.
1929 సంవత్సరం ఏప్రిల్ నెలలో భగత్ సింగ్ తన సహచరుడు బతుకేశ్వర్ దత్‌తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరికీ హాని కలిగించకుండా రెండు బాంబులు వేశారు. ఈ సమయంలో రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉన్నారు. ఆ సమయంలో వారు ప్రసిద్ధ స్వాతంత్ర పోరాట నినాదం అయిన ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్ ’’ అంటూ నినాదాలు చేశారు. తాము అరెస్టుకు సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు వస్తారు. దీంతో బ్రిటిషర్లు వారిని అరెస్టు చేశారు.
భారత స్వాతంత్ర కాంక్ష బలంగా తెలియజేయడానికి బాంబు వేశామని, అంతే కానీ తాము ఎవరికీ హాని కలిగించాలని ఉద్దేశంతో చేయలేదని వారు కోర్టులో ధైర్యంగా చెప్పారు. అయితే వీరిని కోర్టు దోషులుగానే తేల్చింది. వీరికి ఉరి శిక్ష ఖరారు చేసింది. దీంతో 1931 మార్చి 23వ తేదీన వారు ఈ భరత భూమిలో కలిసిపోయారు. ఆ ముగ్గురు త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. నేడు ఆ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారిని దేశం మొత్తం వారిని స్మరించుకుంటోంది.