షహీద్ భగత్‌సింగ్ ఒక టెర్రరిస్టు: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. పంజాబ్ మినిస్టర్ ఫైర్

Published : Jul 16, 2022, 12:15 AM IST
షహీద్ భగత్‌సింగ్ ఒక టెర్రరిస్టు: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. పంజాబ్ మినిస్టర్ ఫైర్

సారాంశం

స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్‌సింగ్ ఒక టెర్రరిస్టు అని పంజాబ్‌లో ఇటీవలే ఎన్నికైన ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాలీ దళ్ కూడా విమర్శించింది.  

న్యూఢిల్లీ: పంజాబ్‌లో కొత్తగా ఎంపీగా ఎన్నికైన సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతంత్ర్య సమర యోధుడు షహీద్ భగత్‌సింగ్‌ను ఒక టెర్రరిస్టు అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కలకలం రేపాయి. పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ సదరు ఎంపీపై మండిపడ్డారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శిరోమణి అకాలీ దళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్‌ను విమర్శించారు. ప్రతి సిఖ్, ప్రతి పంజాబీ, ప్రతి భారతీయుడు షహీద్ భగత్‌సింగ్ పట్ల గర్విస్తుంటారని, ఈ ఎమ్మెల్యే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల ఇమేజ్‌ను తగ్గిస్తాడని తగ్గించేలా మాట్లాడారని పేర్కొన్నారు.

కర్నాల్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను భగత్‌సింగ్‌‌ను ఎందుకు ఒక టెర్రరిస్టుగా పేర్కొన్నారని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండని పేర్కొంటూ సర్దార్ భగత్‌సింగ్ ఓ యువ ఇంగ్లీష్ అధికారిని చంపేశాడని అన్నారు. అమృత్‌దారి సిఖ్ కానిస్టేబుల్‌ చన్నన్ సింగ్‌నూ హతమార్చాడాని వివరించారు. అప్పటి నేషనల్ అసెంబ్లీపైనా బాంబు విసిరేశాడని తెలిపారు. ఇప్పుడు చెప్పండి భగత్‌సింగ్ తీవ్రవాది కాదా? అంటూ తిరిగి విలేకరులనే ప్రశ్నించారు. అయితే, అది దేశానికి స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం కదా? అని విలేకరులు అడిగారు. పార్లమెంటుపై బాంబు వేసినవారు తీవ్రవాది కాదా? అని మళ్లీ వాదించారు. ఆయన ఎలా తీవ్రవాది అవుతారని, దేశం కోసం చేసిన పోరాటం అది అని విలేకరులు తెలుపగా.. తాను వాదించబోనని, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని దాటవేసే ప్రయత్నం చేశారు.

ఇటీవలే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి భగవంత్ సింగ్ మాన్ ఎంపీగా రాజీనామా చేసి సీఎం క్యాండిడేట్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. భగవంత్ సింగ్ మాన్‌తో సంగ్రూర్ ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ సీటుకు ఇటీవలే ఉప ఎన్నిక జరిగింది. ఇందులో భగవంత్ సింగ్ మాన్ పార్టీకి షాక్ తగిలింది. ఈ స్థానాన్ని ఆప్ గెలుచుకోలేకపోయింది. కానీ, శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) పార్టీ చీఫ్ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ గెలిచారు. ఈయన ఇది వరకు చాలా సార్లు ఖలీస్తాన్‌ను సమర్థించారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. పంజాబ్ ఉన్నత విద్యాశాఖ, భాషల మంత్రి గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్‌సింగ్‌కు అమరుడి హోదా ఇస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎంపీ భగత్ సింగ్ చేసిన ప్రాణ త్యాగాన్ని అగౌరవపరిచారని పేర్కొన్నారు. కేవలం పంజాబ్ మాత్రమే కాదని, యావత్ దేశం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదని, వారిపట్ల గర్వంగా ఉంటుందని వివరించారు. వీరి ప్రాణ త్యాగాల వల్ల ఇప్పుడు భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని తెలిపారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని, అవసరం అయితే.. ఆ ఎంపీపై న్యాయపరమైన చర్యలకూ ఆదేశిస్తుందని ఆ మినిస్టర్ అన్నారు. పంజాబీలంతా గౌరవించే భగత్ సింగ్‌ను ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్‌ అగౌరవపరిచారని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..