
Karnataka: కర్నాటక భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి ఓ మహిళతో ఆయన రాసలీలలు సాగిస్తున్న వీడియో సీడీ బయటకు రావడంతో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి రాజీనామా చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ వీడియోకు సంబంధించిన (Sex for job case) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) సమర్పించిన తుది నివేదికపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదుదారు మహిళ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ని విచారించిన అనంతరం న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, జెకె మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ ను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను మార్చి 9లోగా పరిష్కరించాలని కర్నాటక హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఫిబ్రవరి 3, 2022న కబ్బన్ పార్క్ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి తుది నివేదికను న్యాయస్థానం ముందు సమర్పించేందుకు సిట్‌కు అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఫిర్యాదుదారు సవాలు చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తుది నివేదికను సమర్పించామని, బెంగళూరులోని ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు కేసును అప్పగించామని, ఫిర్యాదు చేసిన మహిళకు నోటీసులు కూడా జారీ చేశామని జార్కిహోళి తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా తెలిపారు. గత ఏడాది మార్చిలో జార్కిహోళి (అప్పట్లో మంత్రి) కుట్ర జరిగిందని ఆరోపిస్తూ అప్పటి హోంమంత్రికి చేసిన అభ్యర్థన మేరకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు మహిళ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ మహిళ పై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయగా, దానిని సిట్‌కు రిఫర్ చేశారు.
ఇది నియంత్రిత దర్యాప్తు అని వాదించిన ఆయన, సిట్ ఏర్పాటుకు సంబంధించిన అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు 'బి' రిపోర్ట్‌ను దాఖలు చేశారన్నారు. సిట్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా , దర్యాప్తు సంస్థ సమర్పించిన ముగింపు, తుది నివేదికను సమర్థ న్యాయస్థానం పరిగణించాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ధర్మాసనం.. “ఈ విషయాన్ని హైకోర్టు నిర్ణయించనివ్వండి. సిట్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదు" అని పేర్కొంది.
కాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి చెందిన రమేష్ జర్కిహోళి 2020 నుండి రాష్ట్ర ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా ఉన్నారు. బాధితురాలిని మంత్రి లైంగికంగా వేధిస్తున్నట్లు చూపించే సీడీ పబ్లిక్ డొమైన్‌లో ప్రసారం కావడంతో గత ఏడాది మార్చిలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనేక పరిణామాల మధ్య ఆమె మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు (IPC సెక్షన్ 354A), అధికారంలో ఉన్న వ్యక్తి లైంగిక సంపర్కం (IPC సెక్షన్ 376C) మరియు శిక్షాస్మృతి మరియు సమాచార సాంకేతిక చట్టంలోని ఇతర నిబంధనలతో పాటు బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేయడానికి గత ఏడాది మార్చిలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరోపించిన సంఘటన జరిగినప్పుడు బాధితురాలు ఉద్యోగం కోసం మాజీ మంత్రిని సంప్రదించింది. ఆమె మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది.