
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన పేలుడులో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖోర్ధా జిల్లా పరిధిలోని భూసందపూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. డోలా పండుగను దృష్టిలో ఉంచుకుని భూసందపూర్ గ్రామంలోని ఓ చోట 10 మందికి పైగా పటాకులు తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పేలుడులో గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేపట్టారు.