దోషిగా తేల్చండి.. లేదా నిర్దోషిగా ప్రకటించండి.. 11 ఏళ్ల నుంచి విచారించకుండా జైల్లో ఉంచారా?: సుప్రీం

By telugu teamFirst Published Aug 30, 2021, 8:28 PM IST
Highlights

రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లలో 1993లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌ల కేసులో అరెస్టు అయిన ఓ నిందితుడు 2010 నుంచి జైలులోనే ఉంటున్నారు. ఆయనపై చార్జిషీటు దాఖలు కాలేదు. విచారణా ప్రారంభమవ్వలేదు. దీనిపై సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుపై మండిపడింది. కనీసం విచారణే ప్రారంభించకుండా 11 ఏళ్లు జైలులో ఉంచడం సరికాదన తెలిపింది. 11ఏళ్లు ఎందుకు జాప్యం జరిగిందో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పెషల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దోషిగానైనా తేల్చాలని, లేదంటే నిర్దోషిగానైనా ప్రకటించాలని, అంతేకానీ, విచారణ లేకుండా జైలుకు పరిమితం చేయవద్దని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తెలిపింది.
 

న్యూఢిల్లీ: రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లలో సీరియల్ బ్లాస్ట్‌ల కేసుకు సంబంధించి 11 ఏళ్ల నుంచి ఓ నిందితుడు ట్రయల్ లేకుండా జైలులో మగ్గుతున్నాడు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. ఆయనను దోషిగానైనా తేల్చాలని లేదా నిర్దోషిగా ప్రకటించాలని సూచించింది. అంతేకానీ, కనీసం చార్జిషీటు కూడా వేయకుండా, విచారణ ప్రారంభించకుండా ఏళ్ల తరబడి జైలుకే పరిమితం చేయరాదని తెలిపింది. అది ఆర్టికల్ 21 అందించే హక్కుల హననమని పేర్కొంది. వెంటనే రెండు వారాల్లో తమకు నివేదిక పంపాలని స్పెషల్ టెర్రరిస్టు డిస్రప్టివ్ యాక్టివిటీస్(ప్రివెన్షన్) యాక్ట్ కోర్టును ఆదేశించింది.

నిందితుడు హమీర్ ఉయి ఉద్దీన్ తరఫు న్యాయవాది షోయబ్ ఆలమ్ వాదిస్తూ పిటిషనర్ 2010 నుంచి జైలులోనే ఉన్నారని, కనీసం చార్జిషీటూ దాఖలు చేయలేదని, ట్రయల్ ఇంకా ప్రారంభం కావల్సిందే ఉన్నదని సుప్రీంకోర్టుకు తెలిపారు. ట్రయల్ చేపట్టకుండా నిరవధికంగా ఒక వ్యక్తిని జైలులోనే ఉంచడం ఆర్టికల్ 21 కల్పించే హక్కులను ఉల్లంఘించినట్టేనని వాదించారు. సమీప భవిష్యత్‌లో విచారణ మొదలై ముగిసే అవకాశం లేనందున స్పెషల్ టాడా కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిందని, కానీ, బెయిల్ నిరాకరించిందని తెలిపారు. ఆయనపై ఉన్న ఆరోపణలు నిర్ధారణ కావాల్సి ఉన్నదని, కాకుండానే 11 ఏళ్లు జైలులో ఉంచడం సరికాదని వివరించారు.

కాగా, ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ నిందితుడు 15ఏళ్లు పరారీలో ఉన్నాడన్నారు. బెంచ్ వెంటనే స్పందిస్తూ అరెస్ట్ 2010లో అయ్యారని, అప్పటి నుంచి ఎందుకు చార్జిషీటు వేయలేదని అడిగింది. ఆయనను దోషిగా తేలుస్తారా? తేల్చండి లేదా నిర్దోషిగానే ప్రకటిస్తారా? అదైనా కానివ్వండి కానీ, విచారణే ప్రారంభించకుండా 11ఏళ్లు జైలులో ఉంచవద్దని ఆదేశించింది. చార్జిషీటు జాప్యానికి న్యాయవాది ఓ కారణం చెప్పారు. మరో నిందితుడు గజియాబాద్‌ జైలులో ఉన్నారని తెలిపారు. దీంతో అయితే, వేరువేరుగానైనా ట్రయల్ చేయండని, లేదంటే కలిపి ట్రయల్ చేయండని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సూచించింది.

1993 డిసెంబర్ 5,6వ తేదీల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లలో సీరియల్ బాంబులు పేలాయి. ఇందులో ఇద్దరు ప్యాసింజర్లు మరణించగా, కనీసం 22 మందికి గాయాలయ్యాయి. 1994 ఆగస్టు 25న సీబీఐ 13 మందిపై చార్జిషీటు ఫైల్ చేసింది. అందులో 9 మంది పరారీలో ఉన్నట్టు పేర్కొంది. హమీర్ ఉద్దీన్‌ను యూపీ పోలీసులు 2020 ఫిబ్రవరి 2న అరెస్టు చేశారు.

click me!