
పఠాన్ కోట్ లో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన పాక్ చొరబాటుదారుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. స్వతంత్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు.. భారత్ భారీ భద్రతా ఏర్పాట్లతో భారీ వేడుకలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు భారత్-పాక్ సరిహద్దులోని కమల్ జిత్ పోస్టు వద్ద ఆదివారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
పాకిస్థాన్ నుంచి భారత సరిహద్దుల్లోకి చొరబడ్డ ఓ చొరబాటుదారుడిని గుర్తించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. సుమారు 14 రౌండ్లు బీఎస్ఎఫ్ కాల్పులు జరిపి, అతడిని మట్టుబెట్టింది. కాగా.. ఆగస్టు 10 తెల్లవారుజామున పంజాబ్ లోని తార్న్ తరన్ లో భారత్-పాక్ సరిహద్దులో చొరబాటు యత్నాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగింది. అంతర్జాతీయ సరిహద్దులోని సరిహద్దు భద్రతా కంచె వద్ద కొన్ని అనుమానాస్పద కదలికలను గమనించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది.
అయితే ఆగస్టు 11వ తేదీన కూడా బీఎస్ఎఫ్ దళాలు తార్న్ తరణ్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన తెకలాన్ సమీపంలో ఉన్న ప్రాంతంలో సరిహద్దు ఫెన్సింగ్ కు ముందు పాకిస్తాన్ దుండగుడి అనుమానాస్పద కదలికలను గమనించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. చొరబాటుదారుడిని సమీపించాయి. అక్కడే ఆగిపోవాలని బలగాలు అతడికి సూచించినప్పటికీ ముందుకు సాగాడు. దీంతో జవాన్లు కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ముప్పు పొంచి ఉందని గ్రహించిన బీఎస్ఎఫ్ బలగాలు ఆత్మరక్షణ కోసం దుండగుడిపై కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొంది.